
India-USA Trade Talks: త్వరలోనే వాణిజ్య చర్చలు? రాత్రికి భారత్‌కు రానున్న అమెరికా ప్రతినిధి
ఈ వార్తాకథనం ఏంటి
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించడంతో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో అనిశ్చితి నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ వాణిజ్య చర్చల్లో కదలిక రాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారుల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ రోజు రాత్రి అమెరికా ప్రతినిధి భారత్‌కు పర్యటించనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా మంగళవారం భారత్-అమెరికా మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
వివరాలు
అక్టోబర్ లేదా నవంబర్ నాటికి మొదటి దశ ఒప్పందం పూర్తిచేయాలని లక్ష్యం
మార్చి నెల నుండి భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (Trade Deal) కోసం చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా ఇరు దేశాల ప్రతినిధులు వాణిజ్య పరమైన వివాదాలను పరిష్కరించేందుకు సమావేశమయ్యారు. ఆరవ రౌండ్ చర్చల కోసం అమెరికా బృందం ఆగస్టు 25న భారత్‌కు రావాల్సిన పరిస్థితి ఉండగా, ట్రంప్ సుంకాల నిర్ణయం కారణంగా ఆ పర్యటన కొంచెం ఆలస్యమైంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి మొదటి దశ ఒప్పందం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
కీలకంగా మారిన యూఎస్ ప్రతినిధి భారత పర్యటన
ఇదిలాఉంటే.. ట్రంప్ సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని పోస్ట్ చేసినప్పుడు, ప్రధాని మోదీ కూడా తాను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నానని స్పందించారు. ఈ సందర్భంలో యూఎస్ ప్రతినిధి భారత పర్యటన కీలకంగా మారింది. రష్యాతో భారత విధానాలపై ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పదే పదే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల్లో నవారో మళ్ళీ స్పందిస్తూ, చర్చల్లో భారత్‌ను ఒప్పించామని అర్థమవుతున్న విధంగా వ్యాఖ్యానించారు. మరోవైపు, భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఇటీవల చెప్పిన ప్రకారం, ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, ఇరు పక్షాలూ సంతృప్తిగా ఉన్నాయని తెలిపారు.
వివరాలు
భారత్ ఎగుమతులపై 50 శాతం అమెరికా సుంకాల భారం
మొదటి విడత ఒప్పందం ఈ ఏడాది నవంబర్ నాటికి ఖరారు అయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వీటికి సంబంధించి చర్యలు చేపట్టాలని, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ట్రంప్, మోదీ స్వయంగా తమ ప్రతినిధి బృందాలకు ఈ ఒప్పందం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతానికి భారత్ ఎగుమతులపై అమెరికా నుండి 50 శాతం వరకు సుంకాలు విధిస్తోంది.