
pak spy: పాక్ కు గూఢచర్యం.. జమ్ముకశ్మీర్‌లో భారత ఆర్మీ సైనికుడు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పంజాబ్ పోలీసులు ఓ సైనికుడిని అరెస్టు చేశారు. అతడు పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి భారత సైనిక సమాచారం లీక్ చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లా నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవీందర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అతడు ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఉరి ప్రాంతంలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. గూఢచర్య ఆరోపణల కేసులో ఇటీవల అరెస్టైన మాజీ సైనికుడు గుర్‌ప్రీత్ సింగ్‌ను విచారించగా దేవీందర్ పేరు వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.
వివరాలు
మొహాలీ కోర్టులో దేవీందర్‌ను హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు
వీరిద్దరూ 2017లో మహారాష్ట్రలోని పుణె ఆర్మీ క్యాంప్‌లో తొలిసారి కలిశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వివరించారు. ఆపరిచయం అనంతరం వీరి మధ్య స్నేహ బంధం గాఢమైనట్లు వెల్లడించారు. ఆతర్వాత సిక్కిం,జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో కలిసి విధులు నిర్వహించినట్లు కూడా గుర్తించారు. సైన్యంలో సేవల సమయంలో భారత సైన్యానికి చెందిన కీలకమైన గోప్యమైన సమాచార పత్రాలను గుర్‌ప్రీత్ సింగ్ లీక్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఆ పత్రాలను సేకరించడంలో దేవీందర్ కీలకంగా పనిచేశాడని విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. దేవీందర్‌ను అరెస్టు చేసిన అనంతరం మొహాలీ కోర్టులో హాజరుపర్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈగూఢచర్య కేసులో దేవీందర్ పాత్రను వెలుగులోకి తీసుకొచ్చే దిశగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.