
PM Modi: ప్రపంచ శాంతికి భారత్-చైనా సంబంధాలు కీలకం.. వాంగ్ యీతో భేటీ తర్వాత మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రాంతీయ స్థిరత్వం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి,సుసంపన్నతకూ భారత్-చైనా సంబంధాలు అత్యంత ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారతదేశానికి వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం ప్రధాని మోదీని కలిశారు. ఈ భేటీలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి,భద్రతను సంయుక్తంగా కాపాడుకోవడం,వాణిజ్యానికి అనువుగా సరిహద్దు మార్గాలను తిరిగి తెరవడం, వివిధ రకాల వీసాల మంజూరులో సౌలభ్యం కల్పించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, నేరుగా విమాన సర్వీసులను తక్షణం పునరుద్ధరించడం, అలాగే నదీజలాల పంపకంలో పరస్పర సహకారం వంటి అంశాలపై ఇరువురు నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికా వరుసగా భారత వాణిజ్యంపై సుంకాలను పెంచుతున్న సమయంలో ఈ చర్చలు జరగడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
షీ జిన్‌పింగ్‌ను కలిసేందుకు మోదీ ఆసక్తి
సమావేశం అనంతరం మాట్లాడుతూ మోదీ, భారత్-చైనా సంబంధాలు స్థిరంగా ముందుకు సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. త్వరలో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. సరిహద్దులో శాంతి నెలకొనడం అత్యవసరమని మోదీ వాంగ్ యీతో భేటీలో స్పష్టంగా తెలిపారని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అదేవిధంగా సరిహద్దు వివాదానికి పరస్పర అంగీకారమైన పరిష్కారం కనుగొనాలనే తమ నిబద్ధతను మోదీ మళ్లీ ధృవీకరించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు
మనం శత్రువులం కాదు.. భాగస్వాములమన్న చైనా మంత్రి
ఇక సరిహద్దు సమస్యల పరిష్కారంలో భాగంగా జరుగుతున్న 24వ ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొనడానికి వాంగ్ యీ ముందుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలిశారు. భారత్-చైనాలు శత్రువులు కాదని,భాగస్వాములమని ఆయన స్పష్టం చేశారు. గడచిన తొమ్మిది నెలల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, సరిహద్దు పరిస్థితులు కూడా స్థిరంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వాంగ్ యీ పర్యటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.గత కొన్ని నెలలుగా భారత్‌కు అరుదైన ఖనిజాలు,ఎరువుల ఎగుమతులను నిలిపివేసిన చైనా,వాటిని తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ అంశంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సోమవారం జరిగిన సమావేశంలో వాంగ్ యీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
మాస్కోకు జైశంకర్
ఇది అమలులోకి వస్తే, ఈ దిగుమతుల నిలుపుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగం సహా అనేక పరిశ్రమలకు గణనీయ ఉపశమనం లభించనుంది. ఇక మరోవైపు, చర్చల్లో భారత్ తైవాన్‌ను చైనాకు భాగమని అంగీకరించిందని వచ్చిన వార్తలను భారత ప్రభుత్వ వర్గాలు పూర్తిగా ఖండించాయి. ఇదిలా ఉండగా, జైశంకర్ మంగళవారం మాస్కోకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో పాటు పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు.