LOADING...
USA: భారతదేశంలో మొక్కజొన్న దిగుమతిపై అమెరికా వ్యూహం.. నిజాలు,పరిమితులు
భారతదేశంలో మొక్కజొన్న దిగుమతిపై అమెరికా వ్యూహం.. నిజాలు,పరిమితులు

USA: భారతదేశంలో మొక్కజొన్న దిగుమతిపై అమెరికా వ్యూహం.. నిజాలు,పరిమితులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో జనాభా 140 కోట్ల మందిని చేరుకుంది. అయినా మా నుంచి బుట్టెడు మొక్కజొన్న పొత్తులైనా కొనరు అంటూ అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లుట్నిక్‌ ఇటీవల అక్కసు వెళ్లగక్కారు. నిజానికి ఈ ప్రకటన వెనుక ఉద్దేశం వేరే. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఏర్పడిన సమస్యను కవర్ చేసుకోవడం కోసం ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారు. న్యూదిల్లీలో జరుగుతున్న భారత్ - అమెరికా వాణిజ్య చర్చలకు ముందు మొక్కజొన్న అంశాన్ని వ్యూహాత్మకంగానే ఆయన తెరపైకి తెచ్చారు. ఆయన మాటలు కొంతమేర నిజం అయినప్పటికీ, భారత్‌కు అమెరికా నుంచి పెద్ద మొత్తంలో మొక్కజొన్న దిగుమతి సాధ్యంకాదు.

వివరాలు 

ఎందుకంటే..

ప్రపంచంలో మొక్కజొన్నను ఎక్కువగా ఉత్పత్తి చేసే టాప్-10 దేశాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 0.97 మిలియన్ టన్నుల మొక్కజొన్నను దిగుమతి చేసుకుంది. వీటిలో 0.53 మిలియన్ టన్నులు మయన్మార్ నుంచి, 0.39 మిలియన్ టన్నులు ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్నాం. అమెరికా నుంచి దిగుమతి చేసిన మొత్తం మాత్రం అతి స్వల్పంగా... కేవలం 1100 టన్నులే. ప్రత్యేకంగా మొక్కజొన్న దిగుమతులకు వర్తించే సుంకం విధానం ఉంది. మొదటగా, 0.5 మిలియన్ టన్నుల వరకు మాత్రమే చెల్లింపు లేని దిగుమతికి అనుమతి. దీన్ని మించి దిగుమతులు తీసుకుంటే, 50%మేర సుంకం (టారిఫ్)చెల్లించాల్సివస్తుంది. ఇక జన్యుపరంగా మార్పులు చేసిన మొక్కజొన్న దిగుమతులకు ప్రభుత్వం అంగీకరించడంలేదు.

వివరాలు 

అమెరికా బాధ ఏమిటీ..? 

ప్రపంచంలోనే అత్యధికంగా మొక్కజొన్నను ఉత్పత్తి చేసే దేశం అమెరికా (USA). ఒక్క సంవత్సరం‌లోనే 377.63 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అందులో 71.70 మిలియన్ టన్నులు ఎగుమతి చేస్తుంది. ఈ మొక్కజొన్నను ప్రధానంగా పౌల్ట్రీ,పశుపరిశ్రమ,ఇంధనం,ఎథనాల్ తయారీలో ఉపయోగిస్తారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 427మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయబోతున్నట్లు అంచనా. ముఖ్యంగా అయోవా,ఇల్లినోయిస్,నెబ్రాస్కా,మిన్నెసోటా,ఇండియానా,సౌత్ డకోటా,నార్త్ డకోటా, కన్సాస్, మిస్సోరీ, ఒహాయో, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో మొక్కజొన్న పెరుగుతుంది. 2022 వరకూ చైనా అత్యధిక దిగుమతిదారుడిగా ఉండేది. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి. 2024 నాటికి చైనా కేవలం 331 మిలియన్ డాలర్ల విలువైన మొక్కజొన్నను మాత్రమే అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఇప్పటికీ మెక్సికో, జపాన్, కొలంబియా మాత్రమే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంటాయి.

వివరాలు 

ట్రంప్‌ చేసిన పని బెడిసికొట్టి.. 

చైనా వ్యతిరేకంగా ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రారంభించడంతో... అమెరికా 2.4 మిలియన్ డాలర్ల దిగుమతిని పరిమితం చేసింది. దీంతో అధిక ఉత్పత్తి అయిపోయిన మొక్కజొన్నను విక్రయించేందుకు కొత్త మార్కెట్లు వెతుకుతోంది. లుట్నిక్ ప్రకటన వెనుక ఈ అసహనమే ఉంది.

వివరాలు 

భారత్‌పై కన్ను అందుకే.. 

అమెరికా వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం,భారత్‌లో మొక్కజొన్న డిమాండ్ వేగంగా పెరుగుతుందని తెలిపింది. 2022-23లో 34.7 మిలియన్ టన్నులు ఉండగా, 2040 నాటికి 98 మిలియన్ టన్నులు, 2050 నాటికి 200.2 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా. ప్రపంచంలో మొక్కజొన్న ఉత్పత్తిలో 30% పైగా వాటాను అమెరికా పంచుకుంటుంది. భారత్ టాప్-10 దేశాల్లో ఉన్నా, మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో కేవలం 3% (42 మిలియన్ టన్నులు) మొక్కజొన్నను ఉత్పత్తి చేస్తుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం... జన్యుమార్పిడి (GM) మొక్కజొన్న.

వివరాలు 

భారత్‌పై కన్ను అందుకే.. 

అమెరికాలో 94% జన్యుమార్పిడి వెరైటీలు పండుతాయి. కానీ, భారత్ ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకోవడానికి ఇప్పటికీ అంగీకరించడం లేదు. అదనంగా, బిహార్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో కూడా అక్కడ రైతులకు రైతు సమస్యలు, రాజకీయ కారణాల వల్ల ఎక్కువగా దిగుమతులపై దృష్టి పెట్టడం లేదు. అక్కడ కేజీ రూ.15కి లభించే మొక్కజొన్నను భారత్‌లో రైతులు కేజీకి రూ.22-23 ఖర్చు పెట్టి ఉత్పత్తి చేస్తున్నారు. నీతిఆయోగ్ సూచించిన విధంగా, జన్యుమార్పిడి మొక్కజొన్నను దిగుమతి చేసినా... దాన్ని కేవలం ఇథనాల్, పెట్రోల్ తయారీలో మాత్రమే వాడాలనే నియమాన్ని పెట్టింది. అయితే, ఇది ఎంతవరకు అమలవుతుందో స్పష్టత లేదు.