
Rain havoc: జమ్మూలో 100ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు.. ఆగస్టు నెలలో నమోదైన 2వ అత్యధిక వర్షపాతం..
ఈ వార్తాకథనం ఏంటి
జమ్మూ ప్రాంతంలో రెండు రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. కథువా, సాంబా, రియాసీ, ఉధంపూర్ వంటి పలు ప్రాంతాల్లో వరదల ప్రభావం తీవ్రంగా కనిపించింది. శనివారం నుంచి ఆదివారం వరకు మళ్లీ ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల 100 ఏళ్ల లో ఆగస్టులో రెండో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూ నగరంలో 190.4 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఇది 1926 ఆగస్టు 5న నమోదైన 228.6 మి.మీ రికార్డు తర్వాత, ఆగస్టులో 100 సంవత్సరాల్లో రెండవ అత్యధిక వర్షం. గతంలో 2022 ఆగస్టు 11న 189.6 మి.మీ వర్షం కురిసింది. ఇప్పుడు మళ్లీ 190.4 మి.మీ వర్షం రికార్డు వేసింది.
వివరాలు
కొండచరియలు విరిగిపడటం వల్ల పలు రహదారులు మూతబడ్డాయి
భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇళ్లలోకి నీరు రావడం, రోడ్లలో వరద, జన రవాణా రద్దు, విద్యుత్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. జమ్మూలో చిక్కుకున్న 45 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడటం వల్ల పలు రహదారులు మూతబడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. జమ్మూ నగరంలోని ప్రధాన రోడ్లన్నీ నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వివరాలు
మంగళవారం వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
జానిపూర్, రూప్ నగర్, తలాబ్ టిల్లో, జ్యువెల్ చౌక్, న్యూ ప్లాట్, సంజయ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలో వరద నీరు ప్రవేశించింది. కొన్ని ఇళ్ల సరిహద్దు గోడలు కూలిపోయాయి. దాదాపు డజన్ వాహనాలు నీటిలో మునిగాయి. తావి వంతెన సమీపంలో రోడ్డులో కొంత భాగం కుంగిపోయింది. జమ్మూ బస్టాండ్ దగ్గర ఎగ్జిట్ గేట్ కల్వర్ట్ కూడా కూలిపోయింది. విద్యార్థుల భద్రత కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ హాస్టల్ నుంచి 45 మంది విద్యార్థులను రక్షించారు. వాతావరణ శాఖ మంగళవారం వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.