Page Loader
Justice Yashwant Varma: నోట్ల కట్టల కేసులో..సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ 
నోట్ల కట్టల కేసులో..సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ

Justice Yashwant Varma: నోట్ల కట్టల కేసులో..సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడిన నేపథ్యంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చర్యల నేపథ్యంలో ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్‌ను వేశారు. ఈ కేసులో న్యాయసూత్రాలు పాటించలేదని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఆరోపించారు. తనను పూర్తిగా, పారదర్శకంగా విచారించకుండానే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విచారణ కమిటీని నియమించారని వర్మ పేర్కొన్నారు.

వివరాలు 

ఈనెల 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

ఇక, ఆ విచారణ కమిటీ సమగ్రంగా దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కమిటీ సమర్పించిన నివేదిక చెల్లుబాటు కానిదని ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును వర్మ కోరారు. ఇక ఈనెల 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎంపీల నుంచి సంతకాల సేకరణ ప్రక్రియను ఇటీవల కేంద్రం ప్రారంభించింది. లోక్‌సభలో ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టంగా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వివరాలు 

ఏంటీ వివాదం.. 

ఈ ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికార నివాసంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన పెద్ద చర్చనీయాంశమైంది. ఆ ఘటన సమయంలో ఇంట్లో భారీగా కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడటంతో కలకలం చెలరేగింది. అనంతరం మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించడంతో పాటు, ఆయనకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని స్పష్టమైన సూచనలు చేసింది. నోట్ల కట్టల వివాదంపై విచారణ జరిపేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఆ కమిటీ పూర్తి విచారణ అనంతరం నివేదికను సమర్పించింది.

వివరాలు 

నోట్ల కట్టలు బయటపడిన విషయం నిజమే

ఆ నివేదిక ప్రకారం.. నోట్ల కట్టలు బయటపడిన విషయం నిజమేనని కమిటీ నిర్ధారించింది. ఆ డబ్బు ఉన్న గోదాంపై నేరుగా లేదా పరోక్షంగా జస్టిస్‌ వర్మ లేదా ఆయన కుటుంబసభ్యుల ఆధిపత్యం ఉందని పేర్కొంది. దీనికి సంబంధించి బలమైన ఆధారాలున్నట్లు వెల్లడించింది. నోట్ల కట్టలు వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల స్టోరూమ్‌లో ఉంచడం అనుమానాస్పదమని అభిప్రాయపడింది. పైగా కాలిపోయిన నోట్లు తక్కువ మొత్తం కాదని కమిటీ స్పష్టం చేసింది. అందించిన ఆధారాలు జస్టిస్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి పదవిలో కొనసాగించకూడదనే నిర్ణయానికి చక్కటి ఆధారాలుగా ఉంటాయని కమిటీ అభిప్రాయపడింది.