LOADING...
kishanreddy: హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి
హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌

kishanreddy: హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను (MMTS) పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ (Charlapalli Terminal) నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించామని తెలిపారు.

వివరాలు 

రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి 

"స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణలో రైల్వే లైన్ల నిర్మాణంలో అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతన రైల్వే లైన్ల నిర్మాణం ద్వారా అభివృద్ధి సాధిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో సికింద్రాబాద్,నాంపల్లి, కాచిగూడతో పాటు చర్లపల్లి నాలుగో కొత్త రైల్వే స్టేషన్‌గా ఏర్పడుతోంది. దీనివల్ల హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గుతుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను తక్కువ సమయంలోనే నిర్మించాం. ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయి" అని ఆయన తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.430 కోట్లతో నిర్మించామని, రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు కొత్త సదుపాయాలు అందించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

వివరాలు 

అత్యాధునిక సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌

"దివ్యాంగులు, వృద్ధులకు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేశాం. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం కనెక్టివిటీ రోడ్లను ఏర్పాటు చేయాలి. భరత్ నగర్, మహాలక్ష్మినగర్ వైపున 80 అడుగుల మేర రోడ్లు అవసరం. ఈ పని కోసం రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించగా, వెంటనే అమలు చేయాలి. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో రోడ్ కనెక్టివిటీ ఉంటేనే ప్రయోజనం ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని,దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అంకితం చేస్తారని వెల్లడించారు.

వివరాలు 

రూ.429 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ పనులు

అమృత్ పథకంలో భాగంగా స్థానికంగా ఉన్న అన్నీ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.430 కోట్లతో చర్లపల్లి, రూ.715 కోట్లతో సికింద్రాబాద్, రూ.429 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్లలో పనులు ప్రారంభించినట్లు వివరించారు. రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్ మానిఫ్యాక్చురింగ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. వందేభారత్ రైళ్లు ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో వందేభారత్ ట్రెయిన్లలో స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కిషన్ రెడ్డి చేసిన ట్వీట్