Kolkata rape murder case: కోల్‌కతా డాక్టర్ ఘటన కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసు తదుపరి విచారణ సుప్రీం కోర్టులో జరుగుతోంది. ఈ విచారణకు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అధ్యక్షత వహిస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున కపిల్ సిబల్ సీల్డ్ కవర్ ద్వారా సుప్రీం కోర్టుకు ప్రస్తుత పరిస్థితులపై నివేదిక సమర్పించారు, ఇందులో వైద్యుల సమ్మెల కారణంగా 23 మంది మరణించినట్లు పేర్కొంది.
సీఐఎస్ఎఫ్ అధికారులకు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదు: సోలిసిటర్ జనరల్
ఈ హత్యాచార ఘటనపై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసిన సాంపిల్స్‌పై విచారణ చేపట్టగా, సుప్రీం కోర్టు కొత్త స్టేటస్ రిపోర్ట్ సమర్పించాల్సిందిగా ఆదేశించింది. కోర్టు సీబీఐకి మరో వారం రోజులు గడువు ఇచ్చింది. సోలిసిటర్ జనరల్ బెంగాల్ ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ అధికారులకు సహకరించడం లేదని కోర్టులో తెలిపారు. కోర్టు సీఐఎస్ఎఫ్ అధికారులను రేసిడెంట్ డాక్టర్ల క్వార్టర్స్, మెడికల్ కాలేజ్,ఇందిరా మైత్రి సదన్ వద్ద వసతి కల్పించాల్సిందిగా ఆదేశించింది. వైద్యుల రక్షణకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్‌ను కూడా సమర్పించాలని కోరింది. ఈ కేసు మొదటి విచారణ ఆగస్టు 22న జరిగింది. కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి, ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.
'రీక్లెయిమ్ ది నైట్' మార్చ్
అలాగే, ఆగస్టు 15న ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన నిరసన సందర్భంగా జరిగిన మూక హింసపై సీబీఐతో పాటు బెంగాల్ ప్రభుత్వం నివేదిక సమర్పించాలని కోరింది. ఇక భారతీయ ప్రవాసులు 25 దేశాల్లోని 130 నగరాల్లో నిరసనలు నిర్వహించారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన డాక్టర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన నెలరోజులు పూర్తయిన నేపథ్యంలో వేలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ 'రీక్లెయిమ్ ది నైట్' మార్చ్ నిర్వహించారు.