
Parliament: లోక్‌సభలో నిరసనలకు బ్రేక్.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన స్పీకర్ ఓం బిర్లా..
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిరంతరం అంతరాయానికి గురవుతున్నాయి. బిహార్ ఓటర్ల జాబితాలో జరిగిన ప్రత్యేక ముసాయిదా సవరణ (SIR) అంశంపై ప్రతినిత్యం విపక్షాలు తీవ్రంగా ఆందోళన తెలుపుతుండటంతో రెండు సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. శుక్రవారం రోజూ కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్లో అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు,లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ప్రధాన రాజకీయ పార్టీల సీనియర్ నేతలు హాజరయ్యారు.
వివరాలు
ప్రతిపక్షాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలం
సభా కార్యక్రమాలు శాంతియుతంగా సాగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' అంశంపై చర్చకు సోమవారం (జూలై 28) చర్చ జరిపేందుకు కేంద్రం అంగీకరించింది. విపక్షాల తరఫున కొన్ని ప్రధాన డిమాండ్లపై కేంద్రం సానుకూల స్పందన ఇవ్వడంతో, లోక్‌సభ కార్యకలాపాలు నెమ్మదిగా నార్మల్‌కు వస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య సమగ్ర చర్చకు రంగం సిద్ధమైంది.
వివరాలు
ఉభయ సభలకూ కలిపి మొత్తం 16 గంటల సమయం
విపక్షాల అభ్యర్థన మేరకు ఈ అంశంపై చర్చ కోసం ఉభయ సభలకూ కలిపి మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 28న తిరిగి రావడంతో, అదే రోజు లోక్‌సభలో చర్చ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు రాజ్యసభలో కొనసాగుతుంది. ఈ చర్చల సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా సమాధానం ఇస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేకపోయినా, ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న దృఢమైన వైఖరిని అంతర్జాతీయంగా మరోసారి స్పష్టం చేసేలా ఆయన వ్యాఖ్యానించే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వెల్లడించారు.