
'Legal action underway': వివాదాస్పద వీడియోపై కునాల్ కమ్రా క్షమాపణ చెప్పాలి: వివాదాస్పద వ్యాఖ్యలపై ఫడణవీస్ డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
ఈ విషయంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) స్పందిస్తూ, ''నేను హాస్యానికి వ్యతిరేకం కాదు. కానీ హాస్యం పేరిట ఇతరులను అవమానించడం అంగీకారయోగ్యం కాదు. దిగజారిన హాస్యంతో ఉప ముఖ్యమంత్రిని అవహేళన చేయడం సరైనది కాదు. కునాల్ కమ్రా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి'' అని అన్నారు.
అంతేకాకుండా, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.
వివరాలు
ప్రతి ఒక్కరూ హద్దుల్లో ఉండే మాట్లాడాలి: అజిత్ పవార్
ఇక మరో ఉప ముఖ్యమంత్రి,ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.
''ఎవరూ చట్ట పరిధిని దాటి ప్రవర్తించకూడదు ప్రతి ఒక్కరూ హద్దుల్లో ఉండే మాట్లాడాలి. భిన్నాభిప్రాయాలు సహజమే,కానీ పోలీసుల జోక్యం అవసరం అయ్యేలా వ్యవహరించకూడదు'' అని ఆయన హెచ్చరించారు.
ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్‌లోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో కునాల్ కమ్రా స్టాండప్ షో నిర్వహించాడు.
ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ,''శివసేన నుంచి మరో శివసేన బయలుదేరింది,ఎన్సీపీ నుంచి మరో ఎన్సీపీ విడిపోయింది..అన్నీ గందరగోళంగా మారాయి''అని అన్నారు.
అంతేకాకుండా,ఉప ముఖ్యమంత్రిని ద్రోహిగా అభివర్ణించడంతో పాటు 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ పాటను రాజకీయ పరిణామాలకు అనుగుణంగా మార్చి అవమానకరంగా ప్రదర్శించాడు.
వివరాలు
హాబిటాట్ స్టూడియో క్లబ్‌ను మూసివేత
ఈ షోకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ 'ఎక్స్' (X)లో షేర్ చేస్తూ ''కునాల్ కా కమల్'' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు, ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు.
కమ్రా క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళన నిర్వహించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి కొంతమంది శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో హాబిటాట్ స్టూడియో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.