
MEA: 'ఆ ఆఫర్లు ప్రమాదకరం': రష్యన్ సైన్యంలో భారతీయుల నియామకాలపై స్పందించిన విదేశాంగశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొంతమంది భారతీయులు రష్యా సైన్యంలో చేరి పనిచేస్తున్నట్లు వార్తలు పలు సార్లు బయటకు వచ్చాయి. తాజాగా ఈ నియామకాలపై గురువారం విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రకటన ద్వారా ప్రభుత్వ దృష్టికి వచ్చిన నివేదికలపై స్పందించారు. రష్యా సైన్యంలో భారతీయులు చేరడం ఎంతగానో ప్రమాదకరమని, దానిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.
వివరాలు
రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలి
''ఇటివరకూ భారతీయ పౌరులను రష్యా సైన్యంలో నియమించుకున్నట్లు అనేక వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి ఆఫర్ల వల్ల వ్యక్తులు తీవ్రమైన ప్రమాదాల్లో పడే అవకాశం ఉందని మేము ముందుగానే పలుమార్లు సూచించాం. ఇది పూర్తిగా ప్రమాదకర వ్యవహారం కావడంతో... ఎవరైనా రష్యా సైన్యంలో చేరడానికి ఆఫర్లు వచ్చినా దానిని ఒప్పుకోవద్దని మళ్లీ మేము స్పష్టం చేస్తున్నాం. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న వారిని కూడా స్వదేశానికి తిరిగి పంపించాలని రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నాం. బాధితుల కుటుంబాలతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నాం'' అని ప్రభుత్వ ప్రకటన ద్వారా విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అప్రమత్తం చేశారు.
వివరాలు
నిర్మాణపనుల సాకుతో రష్యాకు రప్పించి..
నిర్మాణపనుల సాకుతో తమను రష్యాకు రప్పించి యుద్ధంలో మోహరించారని ఉక్రెయిన్ (Ukraine)లోని దొనెట్స్క్ ప్రాంతంలోని ఇద్దరు భారతీయులు ఆరోపించారు. వారు అక్కడ విజిటర్స్ వీసా లేదా స్టూడెంట్ వీసా మీద వెళ్లారని సమాచారం. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కేసును దిల్లీ, మాస్కోలోని రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. గతంలో కూడా ఇదే అంశాన్ని చాలా గంభీరతతో తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు రష్యా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని చూపించింది. ముఖ్యంగా, గత ఏడాది రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ , ఈ పరిస్థితి గురించి పుతిన్‌తో ప్రధానంగా చర్చించిన విషయం తెలిసిందే.