Page Loader
Hyderabad:వివిధ అంశాలలో పరీక్షలు.. ఇదీ 'మిస్‌ వరల్డ్‌' పోటీల తీరూతెన్నూ..
వివిధ అంశాలలో పరీక్షలు.. ఇదీ 'మిస్‌ వరల్డ్‌' పోటీల తీరూతెన్నూ..

Hyderabad:వివిధ అంశాలలో పరీక్షలు.. ఇదీ 'మిస్‌ వరల్డ్‌' పోటీల తీరూతెన్నూ..

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలను ఒక గొప్ప అవకాశంగా మార్చేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని గ్రామీణ, సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక విశిష్టతలను అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు విశేష ప్రణాళికలు రూపొందించింది. ఈ కార్యక్రమం ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో ప్రత్యక్షంగా ప్రసారం కానుండటంతో, తెలంగాణ గ్రామీణ పర్యాటకానికి విశ్వవ్యాప్త గుర్తింపు వచ్చే అవకాశముందని అంచనా. ఈ నెల 17వ తేదీ నుంచి మిస్‌ వరల్డ్‌ పోటీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. దాదాపు 110 దేశాల నుండి వచ్చే అందాల ప్రతినిధులు మొదటి వారం రెండు బృందాలుగా విడిపోయి తెలంగాణలో పర్యటన చేయనున్నారు.

వివరాలు 

గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక

ఈ సందర్భంగా వారిని మన చారిత్రక కట్టడాలు,సంప్రదాయాలు,సాంస్కృతిక నేపథ్యంతో పరిచయం చేయనున్నారు. అనంతరం అసలు పోటీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ వేడుకల ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, వివిధ దేశాల నుంచి పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మంగళవారం నాటికి 28 మంది వస్తే, బుధవారం నాటికి కజఖ్‌స్థాన్, సింగపూర్, డెన్మార్క్, కెన్యా, శ్రీలంక, బెల్జియం తదితర దేశాల నుంచి 40కి పైగా అందగత్తెలు హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం తెలిపింది. ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక జరగనున్న నేపథ్యంలో గురువారం, శుక్రవారం రోజులు రిహార్సల్స్‌కు కేటాయించారు.

వివరాలు 

క్రీడలతో మిస్‌ వరల్డ్‌ ప్రారంభం 

మిస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ ఫైనల్స్‌ ఈ నెల 17న గచ్చిబౌలిలో ప్రారంభమవనున్నాయి. ఇందులో పోటీదారుల ఫిట్‌నెస్‌, ఆరోగ్యం, సానుకూల దృక్పథం, క్రీడా నైపుణ్యాలను పరీక్షిస్తారు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, షుట్‌ అవుట్‌, షటిల్‌ రన్‌, హాకీ షుట్‌ అవుట్‌, 400 మీటర్ల రేస్‌ వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. విభిన్న అంశాలపై ప్రత్యేక పోటీలు కాంటినెంటల్‌ ఫైనల్స్‌ (20, 21 తేదీల్లో టీ హబ్‌ వేదికగా): ఇందులో విజేతలు తమతమ ఖండాలను తుది పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. టాలెంట్‌ ఫినాలే (22న శిల్పకళా వేదికగా): పోటీదారుల కళాత్మకత,ప్రతిభను ఈ సందర్భంగా పరీక్షించనున్నారు. హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌(23న ట్రైడెంట్‌ హోటల్‌ వేదికగా):'బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌'అంశంపై పోటీదారులు తమ సామాజిక కట్టుబాట్లను న్యాయనిర్ణేతల ముందుంచుతారు.

వివరాలు 

ప్రజలకు పరిమిత అవకాశాలు 

ఈ నెల 10న ప్రారంభ వేడుక నుంచి 31న జరిగే ముగింపు కార్యక్రమం వరకు మొత్తం 28 కార్యక్రమాలు జరుగనున్నాయి. అయితే, సామాన్య ప్రజలకు పరిమిత అవకాశాలే లభించనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలోని ప్రారంభ వేడుక, క్రీడా పోటీలకు హాజరయ్యే అవకాశం ఉంది. అంతేగాక, ఈ నెల 24న హైటెక్స్‌లో జరగనున్న జ్యుయలరీ ఫ్యాషన్‌ షోను కూడా పాసులు పొందిన వారు వీక్షించవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుని పాసులు పొందవచ్చు. పాస్‌ పొందేందుకు తెలంగాణ పర్యాటక, సంస్కృతీ అంశాలపై అడిగే 6 ప్రశ్నల్లో కనీసం 5కి సరైన సమాధానాలు ఇవ్వాలి. మొత్తం ఐదు వేల మందికి ఉచితంగా ప్రవేశ పాసులు అందజేయనున్నట్లు సమాచారం.

వివరాలు 

31న గ్రాండ్‌ ఫినాలే 

మిస్‌ వరల్డ్‌ తుది పోటీలు ఈ నెల 31న హైటెక్స్‌ వేదికగా జరగనున్నాయి. వివిధ రౌండ్లలో పోటీదారుల ఎంపిక అనంతరం విజేతను ప్రకటించనున్నారు. ఈ తుది పోటీలకు న్యాయనిర్ణేతల జాబితాలో ప్రముఖ నటుడు సోనూ సూద్‌ కూడా ఉన్నారు.