Arvind Kejriwal: సెప్టెంబర్ 17 తర్వాత కాబోయే ప్రధాని అమిత్ షానే : అరవింద్ కేజ్రీవాల్
హోంమంత్రి అమిత్ షాను ప్రధాని నరేంద్ర మోదీ తన వారసుడిగా చేస్తారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం మరోసారి నొక్కి చెప్పారు. ఇదే సంగతిని ఆయన తీహార్ జైలు నుంచి విడుదలైన సమయంలో ప్రస్తావించిన సంగతి విదితమే. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి లక్నోలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్.. 75ఏళ్ల తర్వాత పార్టీ నేతలు పదవీ విరమణ చేయాలనే నిబంధనను ప్రధాని మోదీ చెప్పారని అన్నారు. "నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17, 2025 నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఆయన అమిత్ షాను తన వారసుడిగా చేయాలని నిర్ణయించుకున్నారు.
పార్టీ నియమావళి పేరుతో సీనియర్స్ ని దూరం పెట్టారు
పార్టీ నియమావళి పేరుతో సీనియర్ నేతలైన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ తదితరులను అధికారిక పదవులకు మోదీ దూరంగా ఉంచడంలో మోదీ సఫలీకృతలయ్యారన్నారు. అదే మార్గాన్ని ప్రధాని పాటించనున్నారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సెప్టెంబర్ 17, 2025న ఆయన(అమిత్ను షా) ప్రధానిని చేయాలని నిర్ణయించుకుని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారన్నారు.
యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన స్థానం నుంచి తొలగిస్తారు: కేజ్రీవాల్ జోస్యం
లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) గెలిస్తే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పదవి నుండి రెండు మూడు నెలల్లో పదవీచ్యుతుడవుతారని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. రాజ్యాంగంలో సమూల మార్పులు చేయడం ద్వారా షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను తొలగించాలని కూడా సరికొత్తగా ఆయన సూచించారు.
2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమట: కేజ్రీవాల్ జోస్యం
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే అవకాశం లేదని, ప్రస్తుత పోలింగ్ సరళి ప్రకారం ఆ పార్టీకి 220 కంటే తక్కువ సీట్లు వస్తాయని సూచిస్తున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. హర్యానా, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో వారి సీట్లు తగ్గనున్నాయి'' అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 41 స్థానాలకు మిగిలిన మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. మే 20, 25 తేదీల్లో 14 నియోజకవర్గాల్లో వరుసగా ఐదు, ఆరో దశల్లో పోలింగ్ జరగనుంది. మిగిలిన 13 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.