Page Loader
Jurala Project: మే నెలలోనే తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు.. 18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం
18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం

Jurala Project: మే నెలలోనే తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు.. 18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

నిండుగా వేసవి కాలంలో సాధారణంగా ఎండలతో ఎడారిలా మారే కృష్ణానదిలో ఈసారి అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది. ఎండిపోయి ఎడారిలా మారిన, కృష్ణా నది ఉరకలెత్తుతూ ప్రవహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వరద ప్రభావంతో ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో గేట్లు తెరచేంత వరకు నీటి మట్టం పెరిగింది. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కృష్ణానదిపై నిర్మితమైన మొదటి ప్రాజెక్టు అయిన జూరాలకు వరద నీరు చేరింది. పైగా, జూరాలకి ఎగువన ఉన్న కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం ప్రవాహం లేనప్పటికీ, మే నెలలోనే జూరాల వరద నీటిని స్వీకరించడం ఒక అరుదైన ఘటనగా భావిస్తున్నారు.

వివరాలు 

జలవిద్యుత్ ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించారు

సాధారణంగా జూన్ నెల తరువాతే జూరాలకు ఎగువనుంచి వరద ప్రవాహం మొదలవుతుంది. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణానికి ముందుగానే ప్రవేశించటంతో కృష్ణానదిలో నీటి ప్రవాహం మే నెలలోనే ప్రారంభమైంది. మే 16న కొంత మేరకు మొదలైన ప్రవాహం, గురువారం రాత్రి నాటికి 90 వేల క్యూసెక్కుల వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు అధికారులు మొత్తం 12 గేట్లను ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే జలవిద్యుత్ ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించారు. ప్రాజెక్టు వద్ద రెండు విద్యుత్ యూనిట్లు, అలాగే దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలోని ఒక యూనిట్‌ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

వివరాలు 

వేసవి తీవ్రత కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా తగ్గిపోయింది

జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు (1045 అడుగుల ఎత్తు). సాధారణంగా ఒకే నీటి సంవత్సరంలో (2024 జూన్ - 2025 మే) మధ్యే గేట్లు తెరుచుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో మే నెలలో వరదలు వచ్చిన సందర్భాలు చాలా అరుదే. మరోవైపు ఈ ఏడాది వేసవి తీవ్రత కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా తగ్గిపోయింది. తాగునీటికి కొరత ఏర్పడే పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకను సంప్రదించి కనీసం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అభ్యర్థించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం కేవలం 1 టీఎంసీ నీటిని మాత్రమే విడుదల చేసింది.

వివరాలు 

వనపర్తి జిల్లాల్లో రైతులు,ప్రజలు ఆనందోత్సాహాలు 

ఇటీవల వరకు ప్రాజెక్టులో నీరు అడుగంటిపోవడంతో,అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ ఇప్పుడు వరద నీరు చేరడంతో మహబూబ్‌నగర్,జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్,వనపర్తి జిల్లాల్లో రైతులు,ప్రజలు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో కొన్నిసందర్భాల్లో మాత్రమే నమోదయ్యాయి. ఉదాహరణకు,2007 మే నెలలో జూరాల ప్రాజెక్టుకు వరద రావడంతో 1.5టీఎంసీల నీటిని విడుదల చేశారు. అంతకుముందు 2002లో 2టీఎంసీలు,2003లో 2.5టీఎంసీలు, 2004లో 4టీఎంసీల వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ రహీముద్దీన్ తెలిపారు. ప్రస్తుతంవరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో,ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసినట్టు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా భీమా నది నుంచి వచ్చే వరద,శుక్రవారం నాటికి జూరాలలోకి చేరే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.