Page Loader
AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు 
ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 23 లేదా 24 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)మంగళవారం ప్రకటించింది. అలాగే, ఈ రుతుపవనాలు ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కూడా ప్రవేశించనున్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2009 తర్వాత ఇలా రావడం ఇదే మొదటిసారి! గత ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే రెండు రోజుల ముందుగా మే 30న కేరళను తాకాయి. ఇదేరోజున తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించాయి. ఒకేసారి కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకడం చాలా అరుదైన విషయం.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌కి అతి భారీ వర్షాల హెచ్చరిక 

ఇదివరకు 2017లో మాత్రమే ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది. ఈ సంవత్సరం కూడా ఇదే తరహాలో పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణుల అంచనా. ఐఎండీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2009లో మే 23న కేరళలోకి నైరుతి ప్రవేశించాయి. ఈ ఏడాది అంచనాల ప్రకారం మే 24న నైరుతి ప్రవేశిస్తే, 2009 తర్వాత అత్యంత త్వరగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన సందర్భంగా ఇది నమోదవుతుంది. అరేబియా సముద్రంలో మే 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు, బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర,ఉత్తర తమిళనాడు ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌కి అతి భారీ వర్షాల హెచ్చరిక 

వీటి ప్రభావంతో బుధవారం,గురువారం రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా బుధవారం రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.