Sridhar Babu : సంక్షోభాన్ని దాటుకుంటూ ముందుకు.. అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తియైంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీని ఓడించి, 'మార్పు' నినాదంతో ప్రజల మద్దతు పొందిన కాంగ్రెస్ పాలనపై ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి. ఏడాది కాలంలో సాధించిన విజయాలను ప్రభుత్వం హైలైట్ చేస్తుండగా, విపక్షాలు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. "ఏం చేశారు?", "ఉత్సవాలకు కారణమేంటి?" అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రభుత్వ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
మంత్రి శ్రీధర్‌బాబు ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీల అమలుపై పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. విద్యారంగం, ఆరోగ్య సేవల అభివృద్ధి తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలు అని, ఈ రంగాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఎవరో కూలగొడితే కూలిపోయేది కాదు కాంగ్రెస్ పార్టీ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నేతలు కలిసొస్తే వారిని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.