
Mumbai Train Blasts: ముంబై రైలు పేలుళ్ల తీర్పుపై సుప్రీం స్టే
ఈ వార్తాకథనం ఏంటి
2006లో ముంబైలో చోటుచేసుకున్న రైలు పేలుళ్ల కేసు విషయంలో మహారాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే. ఈ కేసులో అరెస్టయిన మొత్తం 12 మంది నిందితులు నిర్దోషులని పేర్కొంటూ, వారి మీద ఇతర కేసులు లేకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు వారిని విడుదల చేశారు. అయితే హైకోర్టు తీర్పుతో ఏకీభవించని మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. అయినప్పటికీ, ఇప్పటికే విడుదలైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌పై స్పందించాల్సిందిగా 11 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది.
వివరాలు
సబర్బన్ రైళ్లు లక్ష్యంగా బాంబు పేలుళ్లు
2006 జూలై నెలలో ముంబయిలోని సబర్బన్ రైళ్లు లక్ష్యంగా తీసుకుని వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ దారుణ ఘటనలో మొత్తం 189 మంది ప్రాణాలు కోల్పోగా,మరో 800 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు,12 మందిని నిందితులుగా గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. దీర్ఘకాల విచారణ అనంతరం ట్రయల్ కోర్టు వారిపై నేరాన్ని నిర్ధారించింది.
వివరాలు
నాగ్‌పూర్ జైలులో ఒక నిందితుడు మృతి
ఆ తర్వాత ఐదుగురికి బాంబులు అమర్చినట్టు ఆధారాలు లభించడంతో మరణశిక్ష విధించగా, మిగిలిన ఏడుగురికి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు, అందరూ నిర్దోషులేనని తేల్చి, విడుదలకు ఆదేశించింది. ఈ విచారణ కొనసాగుతున్న సమయంలో నిందితుల్లో ఒకరు నాగ్‌పూర్ జైలులో మరణించారు. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో మిగిలిన పదకొండు మంది నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు.