
Nagarjuna sagar: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రత్యేకంగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, అలాగే శ్రీశైలం నుంచి సాగర్ వైపు చేరుతున్న వరద నీరు కారణంగా నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. పరిస్థితిని గమనించిన అధికారులు అప్రమత్తమై, ప్రస్తుతం రెండు గేట్లను పైకెత్తి దిగువ వైపు నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో వచ్చిన భారీ వరదల సమయంలో అన్ని గేట్లను ఎత్తి నీటిని వదిలిన అధికారులు, వరద తగ్గిన తరువాత వాటిని మూసివేశారు.
వివరాలు
సాగర్ జలాశయంలో ప్రస్తుతం 590 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టం
ప్రస్తుతం మాత్రం 2 గేట్లను సుమారు 5 అడుగుల మేర పైకి ఎత్తి, 16,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు సమాచారం. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 590 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో, ఈ రోజు సాయంత్రం శ్రీశైలం గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.