Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు
ఇండియా టుడే నివేదిక ప్రకారం, దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు. ఆయన తర్వాతి స్థానాల్లో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్థానంలో, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. 2024 సంవత్సరానికి రాజకీయ నాయకుల పనితీరును, వారి శక్తిసామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.
మూడవ శక్తిమంతమైన నేతగా అమిత్‌షా
ఈ నివేదిక ప్రకారం, ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ఎన్నికై 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ నేతలతో స్నేహపూర్వక సంబంధాలను కాపాడుకుంటూ ముందుకు సాగారని విశ్లేషించారు. ప్రధాని తర్వాత మూడవ శక్తిమంతమైన నేతగా అమిత్‌షా గుర్తింపును పొందారు. ప్రధానమంత్రితో సమన్వయం చేసుకుంటూ కీలక నిర్ణయాలలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా తిరిగి తీసుకువచ్చిన నాయకుడిగా రాహుల్ గాంధీని గుర్తించారు. ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తిమంతుడిగా చంద్రబాబు నిలిచారు. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత, 2024 ఎన్నికల్లో విజయవంతంగా ఆధికారం సాధించి కేంద్రంలో బలమైన మద్దతుతో ముందుకు సాగారని వివరించారు.