LOADING...
Railway lines: తెలుగు రాష్ట్రాలలో 11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులకు నివేదికల రూపకల్పన
26 ప్రాజెక్టులకు నివేదికల రూపకల్పన

Railway lines: తెలుగు రాష్ట్రాలలో 11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులకు నివేదికల రూపకల్పన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఒంగోలు-దొనకొండ, దూపాడు-బేతంచర్ల, మచిలీపట్నం-నరసాపురం, రేపల్లె వంటి మార్గాలకు కొత్త రైల్వే లైన్లు వేసే దిశగా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి చెన్నై దిశగా బుల్లెట్‌ రైళ్ల నడకకు అవసరమైన హైస్పీడ్‌ కారిడార్‌ల నిర్మాణం కోసం కూడా రైల్వే శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే రైళ్ల రద్దీ అధికంగా ఉన్న ప్రస్తుత మార్గాల్లో అదనంగా మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్లు వేసేందుకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,960 కిలోమీటర్ల పొడవున 26 ప్రధాన ప్రాజెక్టుల కోసం నివేదికలు తయారు అవుతున్నాయి.

వివరాలు 

కొత్త లైన్లు - హైస్పీడ్‌ కారిడార్లు 

ఇప్పటివరకు రైల్వే అనుసంధానం లేని 11 మార్గాల్లో కొత్త రైలు మార్గాల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో ఈ ప్రాంతాలపై సర్వేలు జరగగా, రైల్వే బోర్డు ఆమోదం అనంతరం వాటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా, కొన్నిచోట్ల బైపాస్‌ లైన్లు, రైల్‌ మీద రైలు వంతెనల నిర్మాణం కూడా ప్రణాళికలో ఉంది. హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్‌లో ఏపీలో 300 కి.మీ. పొడవునా, అలాగే హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌లో రాష్ట్రంలోని 464 కి.మీ. విస్తీర్ణంలో డీపీఆర్‌ల రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

వివరాలు 

సరకు రవాణాకు అదనపు లైన్లు 

విజయవాడ-చెన్నై, విజయవాడ-హైదరాబాద్‌, విజయవాడ-విశాఖపట్నం రైలు మార్గాల్లో సరుకు రవాణా రైళ్ల రాకపోకలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఈ మార్గాల్లో మూడో, నాలుగో లైన్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల మూడో లైన్‌ పనులు కొనసాగుతున్నాయి. ఒడిశా వైపు నుంచి కొత్తవలస మీదుగా విశాఖపట్నానికి బొగ్గు, వివిధ ఖనిజాలు రవాణా చేసే రైళ్లు విపరీతంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్టణంలోని సింహాచలం నార్త్‌ నుంచి కొత్తవలస వరకు ఐదో, ఆరవ లైన్ల నిర్మాణం కోసం డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా 26 ప్రాజెక్టుల డీపీఆర్‌లను నవంబర్‌, డిసెంబర్‌ నెలలలో పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యాన్ని నిర్ణయించింది.