
#NewsBytesExplainer: బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించలేమా? దీనిపై చట్టాలు ఏమి చెబుతున్నాయి?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన కొంత మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు తక్కువ సమయంలో అధికంగా సంపాదించాలనే ఉద్దేశంతో, ఈ యాప్‌లను ప్రోత్సహిస్తున్నారు.
ఫాలోవర్లను మోసం చేసి, అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు వ్యవహరిస్తున్నారు.
దీని ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల ఊబిలో చిక్కుకోవడం, చివరకు ప్రాణాలు తీసుకోవడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
అయితే, దీనికి వ్యతిరేకంగా కొంత మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బెట్టింగ్ యాప్‌ల ప్రభావాన్ని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వివరాలు
బెట్టింగ్ యాప్‌లు ఎలా పనిచేస్తాయి?
ఈ యాప్‌లను అభివృద్ధి చేసే వ్యక్తులు విభిన్న పద్ధతుల్లో వాటిని రూపొందిస్తారు.
ప్రధానంగా మూడు రకాలుగా వీటిని విభజించవచ్చు:
నకిలీ గేమింగ్ యాప్‌లు: ఇవి ముందుగా ప్రోగ్రామ్ చేయబడిన ఆటలను కలిగి ఉంటాయి. ఇందులో యూజర్లు గెలవడం అసాధ్యం, ఎందుకంటే గేమ్ డిజైన్‌దారులు ముందుగానే ఫలితాలను నిర్ణయిస్తారు.
బోనస్ మాయాజాలం: పెద్ద మొత్తంలో బోనస్ అందిస్తామని చెప్పి, ఎక్కువ డిపాజిట్ చేయించుకుంటారు. డబ్బు జమ చేసిన తర్వాత, అనేక కారణాలతో బోనస్ ఇవ్వకుండా మోసం చేస్తారు.
వ్యక్తిగత డేటా దుర్వినియోగం: యాప్‌లో అకౌంట్ సృష్టించే సమయంలో, యూజర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దీనిని హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్ లేదా ఇతర సున్నితమైన డేటాను దుర్వినియోగం చేయడం జరుగుతుంది.
వివరాలు
చట్టపరమైన నియంత్రణలు ఉన్నాయా?
ఇటీవల, తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్, "నా అన్వేషణ" అనే యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఇప్పటికే పోలీసులు కొంతమందిపై కేసులు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు.
భారతదేశంలో బెట్టింగ్‌కు సంబంధించిన చట్టాలు రాష్ట్రానికొక విధంగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తే, మరికొన్ని నియంత్రిత విధానాన్ని అనుసరిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలను అమలు చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఆన్‌లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధించబడింది.
అయితే, సిక్కిం, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో నియంత్రిత విధానంలో అమలు చేస్తున్నారు. అయినప్పటికీ, కొందరు వీటిని అనధికారికంగా కొనసాగిస్తున్నారు.
వివరాలు
బెట్టింగ్‌లో పాల్గొన్నా శిక్ష తప్పదు!
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహించేవారికి, పాల్గొన్నవారికి జరిమానా, జైలు శిక్షలు అమలులో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు 2000 ఐటీ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) లాంటి చట్టాలను ఉపయోగిస్తోంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహించే వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1,00,000 జరిమానా విధించబడే అవకాశముంది.
ఈ యాప్‌లను ప్రోత్సహించే వ్యక్తులు కూడా అదే శిక్షకు లోబడి ఉండవచ్చు.
దీనిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వివరాలు
బెట్టింగ్ యాప్‌ల మోసాలకు గురికాకుండా ఉండాలంటే ఏమి చేయాలి
ఈ బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం.
ఆన్‌లైన్ యాప్‌లు మనకు డబ్బు ఇవ్వవని గుర్తుంచుకోవాలి. అవి మోసపూరితంగా రూపొందించబడ్డ సాఫ్ట్‌వేర్‌లు మాత్రమే.
అత్యాశతో ఈ ప్లాట్‌ఫామ్‌లపై నమ్మకం ఉంచి డబ్బు పోగొట్టుకోవద్దు. ఈ యాప్‌ల ద్వారా బెట్టింగ్ ఆడిన వారికీ కూడా చట్టపరమైన శిక్షలు తప్పవు.
కాబట్టి, సమాజంలో ఇలాంటి మోసపూరిత వ్యవస్థలను ప్రోత్సహించకుండా, వాటికి పూర్తిగా దూరంగా ఉండటమే ఉత్తమ మార్గం.