
Vice President: బీజేపీ భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నాయకుడే.. నెక్స్ట్ ఉప రాష్ట్రపతి..!
ఈ వార్తాకథనం ఏంటి
ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ కావడంతో ఎన్డీయే కూటమి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఉప రాష్ట్రపతి పదవిని భర్తీ చేయడం అనివార్యమైంది. ఇప్పటికే ఈ పదవికి సంబంధించి పలువురు పేర్లు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా జేడీయూ నేత, కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ లోపలి విశ్వసనీయ వర్గాలు ఖండించాయి. తదుపరి ఉప రాష్ట్రపతిగా తమ పార్టీకి చెందిన నేతకే అవకాశం ఇస్తామని స్పష్టం చేశాయి.
వివరాలు
జేడీయూ, భాజపా మధ్య ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదు
రామ్‌నాథ్ ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఇటీవల భేటీ కావడంతో ఆయన్నే అభ్యర్థిగా పరిశీలిస్తున్నారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఈ భేటీ సాధారణమైన సమావేశం మాత్రమే అని భాజపా వర్గాలు వెల్లడించాయి. రామ్‌నాథ్ ఠాకూర్ అభ్యర్థిత్వం గురించి జేడీయూ, భాజపా మధ్య ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని వాటి వర్గీయులు స్పష్టం చేశారు. ఆయన పేరు ఉప రాష్ట్రపతి పదవికి పరిశీలనలో ఉన్నట్లు వస్తున్న కథనాల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. భాజపా భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నాయకుడిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు పార్టీ యోచిస్తోందని సమాచారం.
వివరాలు
ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కసరత్తు మొదలుపెట్టిన ఎన్నికల సంఘం
ఇక ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జేడీయూ నాయకుడు హరివంశ్ నారాయణ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వంటి ప్రముఖుల పేర్లు ఉప రాష్ట్రపతి పోటీలో చర్చనీయాంశంగా మారాయి. వీరిలో ఎవరిని ఎన్డీయే ఎంపిక చేస్తుందన్న ఆసక్తి కొనసాగుతోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు కోసం చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులూ కలిసే ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పడనుంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.