Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ' బోర్డు పెట్టారని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా ఆ పార్టీకి ప్రజలు దూరంగా ఉండటమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. మంగళవారం హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాల అనంతరం దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ భారత ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని పలుచన చేసేందుకు కుట్రలు పన్నిందని మోదీ ఆరోపించారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర సంస్థలపై నిందలు వేస్తోందని, ప్రజలను విభజించేందుకు రాహుల్‌గాంధీ కులగణన పేరుతో ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో భీజేపీ అత్యధిక ఓట్లు సాధించింది
కులగణనతో ఎస్సీ, ఎస్టీలను, రైతులను, యువతను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారని మోదీ చెప్పారు. కానీ హర్యానా ప్రజలు కాంగ్రెస్ దేశవ్యతిరేక విధానాలను తిరస్కరించారని చెప్పారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. బీజేపీ కార్యకర్తలు ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో పనిచేయడం, అభివృద్ధి అజెండాను ప్రజలకు చేరవేయడమే ఈ విజయానికి కారణమని అన్నారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ఓట్లు సాధించడాన్ని భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా మోదీ అభివర్ణించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు వారి మద్దతు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలపై ఆధారపడుతున్న పరాన్న జీవిగా మారిందని, చివరికి ఆ పార్టీలను కూడా కాంగ్రెస్ మింగేస్తుందని విమర్శించారు.
ఖర్గే, కేజ్రీవాల్ స్పందన
హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తాము ఈ ఫలితాలను ఊహించలేకపోయామని, ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు. మరోవైపు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ ఓటమి తమకు గుణపాఠం నేర్పిందని, ఎన్నికలను తేలిగ్గా తీసుకోకుండా ప్రతీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావించాలని పిలుపునిచ్చారు.