
Ajit Doval: ఎస్-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్ దోవల్
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రాబోయే వారం రష్యా పర్యటనకు సన్నద్ధమవుతున్నారని సమాచారం.
మాస్కోలో మే 27 నుండి 29 వరకు నిర్వహించనున్న భద్రతా వ్యవహారాలపై ఉన్నత స్థాయి ప్రతినిధుల 13వ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా, రష్యా నుండి భారతదేశానికి రావలసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు సరఫరా అంశంపై చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లుగా పలు ఆంగ్ల వార్తా సంస్థలు నివేదించాయి.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో డోభాల్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.
ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' సందర్భంలో భారత రక్షణ వ్యవస్థలో ఎస్-400 కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
వివరాలు
ఒప్పంద విలువ సుమారు రూ. 35 వేల కోట్లు
ఇది వైమానిక దాడులు, క్షిపణి దాడులను తిప్పికొట్టగల అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ.
శత్రువు నుంచి వచ్చే యుద్ధ విమానాలు,డ్రోన్లు,క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితంగా చేజేతులా అడ్డుకునే సామర్థ్యం దీనికుంది.
అంతేకాక, ప్రత్యర్థులు వినియోగించే జామింగ్ విధానాలను కూడా సమర్థంగా తట్టుకోగలదు.
ఈ ఆధునిక వ్యవస్థను రష్యాలోని ఎన్‌పీవో అల్మాజ్ అనే సంస్థ రూపొందించింది.
2018లో భారత్-రష్యాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం మొత్తం ఐదు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఒప్పంద విలువ సుమారు రూ. 35 వేల కోట్లు. ఇప్పటివరకు మూడు వ్యవస్థలు భారతదేశానికి వచ్చాయి. మిగిలిన రెండు వ్యవస్థలు 2026 ఆగస్టు నాటికి అందజేయనున్నట్లు గతంలో వార్తలు వెలుగులోకి వచ్చాయి.
వివరాలు
'ఆపరేషన్ సిందూర్'సమయంలో పాకిస్థాన్ అసత్య ప్రచారాలు
అయితే,ఇప్పటికిప్పుడు వాటిని ముందుగానే అందించేలా చర్చించేందుకు దోవల్ ఈసారి పర్యటనలో మాస్కోను సంప్రదించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వ్యవస్థలను భారత వైమానిక దళం వినియోగిస్తోంది.పాకిస్థాన్ నుంచి వచ్చే ముప్పును దృష్టిలో ఉంచుకొని పంజాబ్, రాజస్థాన్‌లో ఒక్కొక్క ఎస్-400 వ్యవస్థను మోహరించారు.
చైనా వైపు నుండి రక్షణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను మోహరించినట్లు అంచనా వేస్తున్నారు.
ఇటీవల జరిగిన'ఆపరేషన్ సిందూర్'సమయంలో పాకిస్థాన్ కొన్ని అసత్య ప్రచారాలు చేసింది.
భారత ఎస్-400 వ్యవస్థలను తామూ ధ్వంసం చేశామని పేర్కొన్నప్పటికీ,భారత ప్రభుత్వం వెంటనే గట్టి ప్రతిస్పందన ఇచ్చింది.
ప్రధాని మోదీ చిత్రంతో కూడిన స్పష్టమైన ఖండన వెలువడగా,భారత ఆర్మీ కూడా మన రక్షణ వ్యవస్థ యథావిధిగా పనిచేస్తోందని వెల్లడించింది.