Odisha: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. పూరీ ఆలయంలో నెయ్యి నాణ్యత పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో ప్రసాదం వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. లడ్డూ ప్రసాదంలో కొవ్వు పదార్థం ఉపయోగించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశం రాజకీయాల్లో కూడా వేగంగా చర్చకు దారి తీసింది. అదే సమయంలో,ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయగా,పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ మాట్లాడుతూ, తిరుపతి దేవస్థానంలో జరిగిన ఆరోపణలు తమ వద్ద లేవని స్పష్టం చేశారు.అయినప్పటికీ,12వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతను అధికారులు పరీక్షిస్తారని తెలిపారు. ఇక్కడి నెయ్యి సరఫరాదారు ఒడిశా మిల్క్ ఫెడరేషన్ (OMFED)అని వివరించారు.
సేవకులతో చర్చలు
సిద్ధార్థ్ శంకర్ స్వైన్ మాట్లాడుతూ, OMFED ద్వారా సరఫరా అయ్యే నెయ్యి నాణ్యతను సక్రమంగా పరీక్షించి, కల్తీకి అవకాశం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో, ప్రసాదం తయారీకి సహకరిస్తున్న ఆలయ సేవకులతో కూడా చర్చలు జరగనున్నాయని చెప్పారు. మరోవైపు, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదం విషయంలో కొవ్వు పదార్థం కూరుకుపోయిందనే ఆరోపణలపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పిటిషన్ వివరాలు
సూర్జిత్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేసి, దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నియమించాలని సుప్రీం కోర్టును కోరారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఈ అంశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాకా కూడా చేరింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక పిటిషన్ దాఖలు చేయగా, తప్పుడు ఆరోపణలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆ ఆరోపణలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
తాజాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, వారి హయాంలో తిరుపతి దేవస్థానం ప్రసాదాల్లో జంతువుల కొవ్వు వాడేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇప్పుడేమో స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే వాడుతున్నారని తెలిపారు.ఆయన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. వైఎస్‌ఆర్‌సీపీ నేత వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ, చంద్రబాబు ఆరోపణలను పూర్తిగా ఖండించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, దైవాలయ పవిత్రతను, హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.