
Outer Ring Train: ఔటర్ రింగ్ రైలు 392 కి.మీ.. 26 స్టేషన్లతో తుది ఎలైన్‌మెంట్ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోనే తొలి ప్రతిష్ఠాత్మకమైన 'ఔటర్ రింగ్ రైలు' ప్రాజెక్టుకు తుది ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. మొత్తం 392 కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు, 14 మండలాలను ఈ మార్గం కలుపనుంది. దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రాజెక్టును అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో కొత్తగా 26 రైల్వే స్టేషన్లు ఏర్పాటవుతాయి. మొత్తం నిర్మాణ వ్యయం రూ.12,070 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఈ రింగ్ రైలు మార్గం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో నిర్మించనున్నారు. ఆలేరు, వలిగొండ, గుళ్లగూడ, మాసాయిపేట, గజ్వేల్ ప్రాంతాల మీదుగా ఔటర్ రింగ్ రైలు ఎలైన్‌మెంట్‌ను నిర్ణయించారు.
వివరాలు
దూరం తగ్గినా అభివృద్ధికి దగ్గరగా..
రెండేళ్ల క్రితం రైల్వే శాఖ తుది సర్వేకు ఆమోదం ఇచ్చినప్పుడు ఈ ఔటర్ రింగ్ రైలు మార్గం మొత్తం 508 కిలోమీటర్లుగా ప్రతిపాదించారు. తుది సర్వేలో దక్షిణ మధ్య రైల్వే మూడు ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించింది. మొదటిది 508.45 కిలోమీటర్లు, రెండవది 511.51కిలోమీటర్లు,మూడవది 392.02 కిలోమీటర్లుగా ఉన్నాయి. ఈమూడు ప్రతిపాదనలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమీక్షించారు. మొదటి రెండు ప్రతిపాదనలు రీజినల్ రింగ్ రోడ్‌కు (ఆర్‌ఆర్‌ఆర్) దూరంగా ఉన్నాయని,మూడవ ప్రతిపాదనను పరిశీలించాలని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే మూడవ ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. 508 కిలోమీటర్ల మార్గంతో పోలిస్తే, ఇప్పుడు ఖరారైన మార్గం దూరం తక్కువగా ఉన్నా, అభివృద్ధి చెందే ప్రాంతాలకు సమీపంగా ఉంటుంది.
వివరాలు
ప్రాజెక్టులో ఆరు ప్రాంతాల్లో 'రైల్ ఓవర్ రైల్' వంతెనలు
392 కిలోమీటర్ల మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) రైల్వే బోర్డుకు పంపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న 361 కిలోమీటర్ల ఆర్‌ఆర్‌ఆర్‌కు 3-5 కిలోమీటర్ల దూరంలోనే ఔటర్ రింగ్ రైలు మార్గాన్ని ఖరారు చేశారు. అయితే కొన్ని చోట్ల ఈ దూరం 11 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ఆరు ప్రాంతాల్లో 'రైల్ ఓవర్ రైల్' (ఆర్వోఆర్) వంతెనలను నిర్మించనున్నారు. కొత్త రైల్వే లైన్‌ను పైభాగంలో ఫ్లైఓవర్ రూపంలో నిర్మిస్తారు. మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్ ప్రాంతాల్లో ఈ ఆర్వోఆర్ వంతెనలు ప్రతిపాదించారు.
వివరాలు
సామాజిక-ఆర్థిక లాభాలు
ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయనుంది. ఆర్‌ఆర్‌ఆర్ కు సమీపంలో రింగ్ రైలును ఏర్పాటుచేయడం ద్వారా రోడ్, రైల్వే రవాణా మార్గాల ఆధారంగా అభివృద్ధి ముమ్మరంగా జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ కనెక్టివిటీ: రింగ్ రైలు ప్రాజెక్టుతో ఆయా స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో రైలుతో కలిపి మల్టీమోడల్ కనెక్టివిటీ అందుతుంది. పర్యావరణ అనుకూల ప్రజారవాణా: ప్రజారవాణా వాడకం పెరిగి, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. ఇంధన వినియోగం, కాలుష్యం తగ్గడం వల్ల పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానం ఏర్పడుతుంది.
వివరాలు
సామాజిక-ఆర్థిక లాభాలు
శివారు ప్రాంతాల అభివృద్ధి: హైదరాబాద్ పరిసర జిల్లాలకు మెరుగైన రైలు కనెక్టివిటీ కల్పించడం ద్వారా అభివృద్ధి ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం కాకుండా, ఇతర ప్రాంతాల అభివృద్ధికి అవకాశాలు కల్పించనుంది. కొత్త టౌన్‌షిప్‌ల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.