
Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వరుసగా భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది.
డ్రోన్ దాడుల ముప్పు పెరగడంతో భారత్ సరిహద్దులో ఉన్న జమ్ముకశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
డ్రోన్ దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి, బ్లాక్ అవుట్ అమలు చేశారు.
ప్రత్యేకంగా జమ్ముకశ్మీర్, సాంబా సెక్టార్, ఫిరోజ్‌పూర్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల చొరబాట్లు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి.
అయితే భారత భద్రతా దళాలు వీటిని ధీటుగా తిప్పికొడుతున్నాయి. అయినప్పటికీ పాక్ డ్రోన్లు జనావాసాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు దిగుతున్నాయి.
Details
భయాందోళనలో ప్రజలు
తాజాగా ఫిరోజ్‌పూర్‌లో ఓ ఇంటిపై పాక్ డ్రోన్ బాంబు పడింది. ఈ దాడిలో ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
వీరిలో ఒక మహిళకు తీవ్రమైన గాయంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, వెంటనే చికిత్స అందిస్తున్నామని ఫిరోజ్‌పూర్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ కమల్ బాగి తెలిపారు.
ఈ దాడి కారణంగా స్థానిక ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత బలపరచింది. డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు.