
Shashi Tharoor:'పాక్ తమకు ప్రయోజనం ఉందని భావించింది కానీ..': ఐరాస భద్రతా మండలి సమావేశం నేపథ్యంలో శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో క్లోజ్డ్‌డోర్ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భద్రతామండలిలో సభ్యదేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం ఏ విధమైన తీర్మానం ఆమోదించబడే అవకాశమే లేదని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
''పాకిస్థాన్‌ను తప్పుబడుతూ ఏదైనా తీర్మానం తీసుకురాగలిగితే,దాన్ని చైనా తప్పకుండా వీటో అధికారంతో అడ్డుకుంటుంది.అదే విధంగా,భారత్‌పై విమర్శలతో కూడిన తీర్మానం వస్తే, చాలా దేశాలు దాన్ని అడ్డుకుంటాయి. చివరికి శాంతికి పిలుపునివ్వడం, ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేయడం వంటి సాధారణ పదజాలంతోనే పరిమితమవుతుంది'' అని ఆయన తెలిపారు.
దీన్ని మించి మరేదీ అనుకోలేమని, ఇది చాలా విచారకరమైన వాస్తవం అని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
పాక్ అణు బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న చాలా దేశాలు
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్థాన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.
ఈ చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేయడం కూడా ఉంది.
ఈ పరిస్థితుల్లోనే ఐరాస భద్రతామండలిలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్థాన్ మొదట భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని యోచించినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
ఇస్లామాబాద్ తరచుగా చేస్తున్న అణు బెదిరింపులపై చాలా దేశాలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాయి.
అంతేకాక, ఇటీవల పాకిస్థాన్ నిర్వహించిన క్షిపణి పరీక్షలను కూడా కొన్ని దేశాలు ప్రశ్నించాయి.