
Indian Army: పాకిస్తాన్ చైనా ఆయుధాలను ఉపయోగిస్తోంది: డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్, చైనా మధ్య ఉన్న బంధంపై భారత ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. శత్రుదేశమైన పాకిస్థాన్ వద్ద ఉన్న 81 శాతం మిలిటరీ హార్డ్‌వేర్ చైనా తయారీదేనని వెల్లడించింది. అంతేకాక, చైనా తన సైనిక సాంకేతికతను పరీక్షించేందుకు పాకిస్థాన్‌ను ఒక ప్రయోగశాలలాగా వాడుకుంటోందని పేర్కొంది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ స్పందించారు.
వివరాలు
పాకిస్థాన్ ప్రథమ శత్రువు
లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ మాట్లాడుతూ, "టెక్నాలజీ, నిఘా ఆధారంగా మేము విస్తృతంగా డేటాను సేకరించాం. ఆ సమాచారం ఆధారంగా ఆపరేషన్‌ను రూపొందించాం. మొత్తం 21 లక్ష్యాలను గుర్తించగా, అందులో తొమ్మిది టార్గెట్లను ధ్వంసం చేయడం సరైనదిగా భావించాం. ఆ నిర్ణయం చివరి నిమిషంలోనే తీసుకున్నాం. మనకు సరిహద్దుల్లో ఇద్దరు ప్రధాన శత్రువులున్నా,వాస్తవానికి మూడుగురు శత్రువులున్నట్లు చెప్పాలి. వీరిలో పాకిస్థాన్ ప్రథమ శత్రువు. ఆ దేశానికి చైనా నుండి అన్ని రకాల మద్దతు లభిస్తోంది. పాకిస్థాన్ మిలిటరీ హార్డ్‌వేర్‌లో 81 శాతం చైనా నుంచి దిగుమతి చేసినవే. తన మిలిటరీ టెక్నాలజీని పరీక్షించేందుకు చైనా పాకిస్థాన్‌ను ఒక ప్రయోగశాలలా ఉపయోగిస్తోంది. అంతేకాదు, తుర్కియే నుండి కూడా పాకిస్థాన్‌కు మద్దతు లభించింది.
వివరాలు
చైనా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు
ఆపరేషన్ సిందూర్ అనంతరం నాలుగు రోజుల పాటు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ సమయంలో డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో భారత్ చేపట్టిన దాడుల పద్ధతులు, వ్యూహాలు గురించి సమాచారం బీజింగ్ నుంచి ఇస్లామాబాద్‌కు చేరుతోందని మా పరిశీలనలో తేలింది" అని ఆయన వెల్లడించారు. ఇందుకు తోడు, స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (SIPRI)వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2015 నుంచీ చైనా పాకిస్థాన్‌కు సుమారు 8.2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించింది. 2020-2024 మధ్యకాలంలో చైనా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది. ఆ ఎగుమతుల్లో 63 శాతం ఆయుధాలు పాకిస్థాన్‌కి వెళ్లినవే. ఈ క్రమంలో పాకిస్థాన్ చైనాకు అతిపెద్ద ఆయుధ ఖరీదుదారుగా మారింది.
వివరాలు
పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి
ఇక 2025లో యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) విడుదల చేసిన నివేదిక ప్రకారం,భారత్ చైనాను ప్రధాన శత్రువుగా భావిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్‌ను ఒక భద్రతాపరమైన సవాలుగా పరిగణిస్తోందని పేర్కొంది. ఇక గత ఏప్రిల్‌లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువలేనిది. దీనిపై ఆగ్రహించిన భారత్, "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది.
వివరాలు
పాకిస్థాన్ కాల్పుల విరమణ
ఈ చర్యతో ఉగ్రవాద గూళ్లను నాశనం చేసింది. దీనిని జీర్ణించుకోలేని పాకిస్థాన్ ప్రతిదాడులకు పాల్పడింది. అయితే భారత్ ఇచ్చిన గట్టి స్పందనతో చర్చలకు సిద్ధమైన పాకిస్థాన్ కాల్పుల విరమణను కోరింది. గమనించదగ్గ విషయం ఏంటంటే, పాకిస్థాన్ చైనా నుంచి సమీకరించిన హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 రక్షణ వ్యవస్థలు, వాటి రాడార్లు ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన ఒక్క క్షిపణినీ అడ్డుకోలేకపోయాయి.