
Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..
ఈ వార్తాకథనం ఏంటి
'ఆపరేషన్ సిందూర్' అనంతరం భారత్‌లో నివసిస్తూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో గడిచిన మూడురోజుల్లో మొత్తం 12 మంది పాక్ గూఢచారులను భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి.
వీరిలో హర్యాణాకు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు.
అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
అరెస్టయిన వారిలో విద్యార్థులు, సెక్యూరిటీ గార్డు, యాప్ డెవలపర్ వంటి వారు కూడా ఉన్నారు.
వివరాలు
వీళ్లు గూఢచారులుగా ఎలా మారారు?
పాకిస్తాన్‌కు గూఢచర్యం చేయడానికి భారత్‌లోని యువత ఎలా ఒప్పుకున్నారన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆలోచనగా మారింది.
దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం, ఈ యువతలో చాలా మందిని పాక్ ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నారు.
ఆపై డబ్బుల వలలో వేసి, అనేక అబద్ధపు హామీలతో ప్రలోభపెట్టారు.
కొందరిని వ్యక్తిగతంగా పాక్‌కి తీసుకెళ్లి, బహుముఖ ఆఫర్లు ఇచ్చి తమ ఉద్దేశాలకు వాడుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న యువతను లక్ష్యంగా చేసుకుని, సాధారణ యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా సమాచార సేకరణ జరిగిందన్నది గమనార్హం.
వివరాలు
పాక్ తరఫున గూఢచర్యానికి పాల్పడ్డవారిలో...
1. గజాలా & యామీన్ మహ్మద్: పంజాబ్‌కి చెందిన ఈ ఇద్దరూ పాక్ ఏజెంట్లకు సమాచారం అందించారని పోలీసులు పేర్కొన్నారు.
మాలేర్కోట్లాకు చెందిన వీరిద్దరూ పాకిస్థాన్ హైకమిషన్ మాజీ ఉద్యోగి డానిష్‌తో కలిసి పని చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.
డానిష్ ద్వారా పాక్‌కి ప్రయాణాల కోసం పాస్‌పోర్టుల పనులు చేయించుకుంటూ, అతని ద్వారా డబ్బులు తీసుకొని స్థానికంగా పాక్ గూఢచారులకు సహాయం చేశారట.
వివరాలు
2. జ్యోతి మల్హోత్రా:
'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న హిసార్‌కు చెందిన జ్యోతి.. 2023, 2024, 2025 మార్చిలో జరిగిన పహెల్గాం ఉగ్రదాడికి ముందే పాకిస్తాన్ వెళ్లినట్టు సమాచారం.
ఆమె పాక్ హైకమిషన్‌లో పని చేసిన ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డనాష్‌తో కలిసి పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పాకిస్థాన్ గూఢచారుల కోసం వీడియోలు తీసి, ఆ ప్రాంతాల సమాచారం అందించినట్లు అనుమానిస్తున్నారు.
వివరాలు
3. దేవేందర్ సింగ్:
పటియాలాలో ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న దేవేందర్.. హర్యాణాలో ఉన్న సమయంలో పాక్‌కు రహస్య సమాచారాన్ని అందించాడన్న ఆరోపణలపై అరెస్టయ్యాడు.
పటియాలా మిలటరీ కంటోన్‌మెంట్ ఫోటోలు తీసి పంపినట్టు సమాచారం. గతేడాది నవంబరులో పాకిస్తాన్‌కి వెళ్లొచ్చిన ఆధారాలు దొరికాయి.
4. అర్మాన్: నూహ్‌కు చెందిన అర్మాన్ పాక్‌కి భారత ఆర్మీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. అతని ఫోన్‌లో పాకిస్థానీ నంబర్లతో చాట్స్, మీడియా ఫైల్స్ లభించాయి.
వివరాలు
5. తరీఫ్:
అతను కూడా నూహ్ జిల్లానికే చెందిన వాడు. పాక్ ఎంబసీకి చెందిన ఇద్దరితో సంబంధాలు ఉన్నట్లు విచారణలో అంగీకరించాడు.
వాళ్ల ద్వారా సిమ్ కార్డులు పొందిన తరీఫ్.. సిర్సాలో ఎయిర్‌పోర్ట్ ఫోటోలు తీసి పంపమని చెప్పినట్టు వెల్లడించాడు.
6. నౌమన్ ఇల్లాహీ: హర్యాణాలోని పానిపట్‌కు చెందిన నౌమన్‌ను మే 15న అరెస్ట్ చేశారు.
ఐఎస్ఐ ఏజెంట్‌తో టచ్‌లో ఉన్న ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిగా, ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
పాక్‌కు కీలకమైన సమాచారం అందించాడన్న ఆరోపణలున్నాయి.
వివరాలు
7. మహమ్మద్ ముర్తాజా అలీ:
పంజాబ్‌కి చెందిన ముర్తాజా.. ఓ మెసేజింగ్ యాప్‌ను స్వయంగా అభివృద్ధి చేసి, దాని ద్వారా ఐఎస్ఐకి సమాచారం పంపేవాడట.
అతని వద్ద మూడు సిమ్ కార్డులు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
8. షెహజాద్:
రాంపూర్‌కు చెందిన షెహజాద్‌ను యూపీలోని ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
అక్రమంగా పాక్ నుంచి వస్తువులు తెచ్చి అమ్ముతూ, స్మగ్లింగ్ వ్యాపారంతో పాటు, భద్రతా సమాచారాన్ని కూడా పాక్‌కి చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.
ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకొని, పలు కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
9. సుఖ్‌ప్రీత్ సింగ్ & కరణ్‌బీర్ సింగ్:
గుర్దాస్‌పూర్‌లో అరెస్ట్ అయిన వీరిద్దరూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల వ్యూహాత్మక వివరాలను పాక్‌కి అందించినట్టు సమాచారం.
పహెల్గాం దాడి తర్వాత ఐఎస్ఐ వీరిని యాక్టివ్ చేయగా, ఒక్కొక్కరి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేసినట్టు అధికారులు వెల్లడించారు. వీరిద్దరూ డ్రగ్స్ స్మగ్లింగ్‌లో కూడా భాగమయ్యారు.