Parliament: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. అదానీ, మణిపుర్ అంశాలపై చర్చకు విపక్షం పట్టు!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఇవి డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ నెల 26న (మంగళవారం) ఉభయసభలకు సెలవు ఉంటుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ రోజు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభా వ్యవహారాల సంఘం (బీఏసీ)లో నిర్ణయించిన అంశాల ప్రకారం మిగిలిన రోజుల్లో సమావేశాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 30 పార్టీలకు చెందిన 42 మంది నేతలు హాజరయ్యారు.
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: రిజిజు
అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతితో కలిసి ప్రజలు రాజ్యాంగ పీఠికను పఠిస్తారని, రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను పుస్తకరూపంలో ప్రజలకు అందిస్తామని తెలిపారు. రాజ్యాంగం సాధారణ పుస్తకం కాదని, అందులో ఉన్న చిత్రాలు, వర్ణనలు, ప్రధానోద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ సమావేశాల తొలి వారంలో సభ ముందుకు రానుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. సమావేశాల్లో మొత్తం 17 బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.
అదానీ అంశంపై విపక్ష డిమాండ్
అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ ప్రతిపాదించింది. అమెరికాలో ఈ అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. మణిపూర్ హింసపై కూడా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేయకుండా సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.