AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త అందించింది. ఈసారి పెన్షన్‌ను సడలింపు చేస్తూ, సెప్టెంబర్ నెలకు గానూ ఆగస్టు 31వ తేదీనే ముందుగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ నెలలో ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆగస్టు 31న పెన్షన్ పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారులకు పెన్షన్ వాయిదా కాకుండా ముందే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఏదైనా కారణంతో ఆగస్టు 31న పెన్షన్ తీసుకోని వారు సెప్టెంబర్ 2న పొందవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు.
2027 నాటికి పోలవరం పూర్తి అవుతుందన్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రయోజనకరమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం ఆమోదించిన పారిశ్రామిక హబ్‌లు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెంచుతాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసిందని, ఈ ప్రాజెక్టును 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ రూపొందించామన్నారు. ఇంకా రూ.15,146 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.