Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధాని, అమిత్‌షా ఆరా
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కీలక శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పురపాలక, విద్యుత్, పంచాయతీరాజ్, హైడ్రా, నీటిపారుదల శాఖల అధికారులకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆదివారం జరిగిన అత్యవసర సమీక్షలో, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో మాట్లాడి, వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని కలెక్టర్లు, ఎస్పీలు సహా వివిధ శాఖల అధికారులు కూడా 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్న అధికారులను వెంటనే తిరిగి హాజరు కావాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
అత్యవసర సేవల అధికారులు కూడా ప్రాంతాల్లో పని చేస్తూ, ప్రతి సమయానికీ సమాచారం సీఎం కార్యాలయానికి చేరవేయాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని,హోంమంత్రి
ఆదివారం రాత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా , రాష్ట్రంలోని వరదలు, వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను గురించి సమాచారం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పలు జిల్లాల్లో జరిగిన నష్టాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యల వివరాలను తెలియజేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని సీఎం వివరించారు. ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకున్న రాష్ట్ర యంత్రాంగాన్ని ప్రశంసించిన ప్రధాని, అత్యవసర సేవల కోసం హెలికాప్టర్లను పంపిస్తామని హామీ ఇచ్చారు.