
PM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా పరంగా వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ముఖ్యంగా జాతీయ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో పెహల్‌గామ్ ఉగ్రదాడి, దానికున్న అనుబంధ పరిణామాలపై చర్చించేందుకు భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది.
ఈ అత్యవసర భేటీకి ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహించనున్నారు.
వివరాలు
కమిటీ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు
ఈసంఘటనపై సీసీఎస్ భేటీ జరగడం ఇది రెండవసారి.దాడి జరిగిన వెంటనే మొదటిసారి ఈ కమిటీ సమావేశమై,అప్పట్లో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.
అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం,పాకిస్థాన్‌తో ఉన్న దౌత్య సంబంధాలను తగ్గించడం,అటారీ సరిహద్దును మూసివేయడం,పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయడం వంటి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇప్పుడు జరగనున్న తాజాభేటీలో పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరింత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
భద్రతాకమిటీ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ కూడ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
ఈ కమిటీలో రాజ్‌నాథ్ సింగ్,అమిత్ షా,నితిన్ గడ్కరీ,జేపీ నడ్డా,నిర్మలా సీతారామన్ తదితర సీనియర్ మంత్రులు సభ్యులుగా ఉన్నారు.