
PM Modi: సెప్టెంబర్‌లో మోదీ అమెరికా పర్యటన! ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి (UN) నిర్వహించే సర్వసభ్య సమావేశం 80వ సెషన్‌కు హాజరవడానికి ఆయన అమెరికా వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం సెప్టెంబర్ 2025లో జరగనుండగా, తాత్కాలిక వక్తల జాబితాలో మోడీ పేరు కూడా సెప్టెంబర్ 26వ తేదీకి చేర్చబడినట్లు తెలుస్తోంది. ఇది ఆయా దేశాలతో జరిగిన సంప్రదింపుల తరువాత రూపొందించబడిన జాబితా కావడం గమనార్హం. అందువల్ల సెప్టెంబర్‌లో మోడీ అమెరికా పర్యటన అనేది దాదాపు ఖాయంగా భావిస్తున్నారు.
వివరాలు
ఐక్యరాజ్యసమితి 2019,2020,2021లో జరిగిన సర్వసభ్య సమావేశాల్లో మోదీ ప్రసంగం
ఇక SCO సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రధాని మోదీ చైనా, జపాన్ దేశాలకు కూడా పర్యటన చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), మాల్దీవుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనల అనంతరం మిగతా మూడు కీలక దేశాలు - చైనా, జపాన్, అమెరికా - పర్యటనలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరపు ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొని ప్రసంగించారు. అయితే గత సంవత్సరంలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా,2019,2020,2021 సంవత్సరాలలో కూడా మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించారు.
వివరాలు
భారత్-అమెరికాల మధ్య ఐదు విడతలవాణిజ్య ఒప్పందంపై చర్చలు
ఇక నవంబర్‌లో జరిగే QUAD సమ్మిట్ కోసం మోడీ రష్యాలో పర్యటించే అవకాశం ఉంది.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదు విడతల చర్చలు ముగిశాయి. కానీ ఎటువంటి స్పష్టమైన ఫలితాలు రాలేదు. ఈ చర్చలలో ముఖ్యంగా పాడి,వ్యవసాయ రంగాలపై అమెరికా కొన్ని మినహాయింపులు కోరినట్టు తెలుస్తోంది. ఇది చర్చలకు అడ్డంకిగా మారిందని సమాచారం. మరోవైపు,అమెరికా నుంచి ఒక ప్రతినిధి బృందం ఆగస్టులో భారత్‌ను సందర్శించబోతోందని సమాచారం. అధ్యక్షుడు ట్రంప్ ఈ చర్చలకు ఆగస్టు 1వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఈ డెడ్‌లైన్‌లోగా చర్చలు ముగుస్తాయా? లేదా గడువు పొడిగిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.