
Ajit Doval: SCO సమ్మిట్ కోసం ప్రధాని మోదీ చైనాకు వెళతారు.. వాంగ్‌తో చర్చల సందర్భంగా NSA అజిత్ దోవల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో చైనా పర్యటనకు వెళ్తారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆగస్టు 31,సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారని డోభాల్ స్పష్టంచేశారు.
వివరాలు
సరిహద్దు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి
న్యూఢిల్లీ లో జరిగిన 24వ ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చల్లో అజిత్ డోభాల్ మాట్లాడుతూ.. గత తొమ్మిది నెలల కాలంలో భారత్-చైనా సరిహద్దు పరిస్థితులు స్థిరంగా మారాయని, ప్రస్తుతం అక్కడ శాంతి వాతావరణం నెలకొన్నదని తెలిపారు. తాజా ద్వైపాక్షిక చర్చలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఇరు దేశాల నాయకులు కజాన్‌లో కలుసుకోవడం వలన ఉద్రిక్తతలు గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. చైనాలో జరగనున్న ఎస్‌సీవో సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారని అధికారికంగా వెల్లడించారు.
వివరాలు
ఎస్‌సీవో సదస్సుకు ప్రధాని మోదీ రాకను స్వాగతిస్తున్నాం: వాంగ్ యీ
ఈ సందర్భంగా వాంగ్ యీ మాట్లాడుతూ.. ''ఇటీవలి కొన్నేళ్లుగా మనం ఎదుర్కొన్న సవాళ్లు రెండు దేశాల ప్రయోజనాలకు అనుకూలంగా లేవు. అయితే మోదీ, షీ జిన్‌పింగ్‌లు కజాన్‌లో కలవడం, ఆ తర్వాత సరిహద్దు పరిస్థితులు స్థిరంగా కొనసాగడం సానుకూల పరిణామం. ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రాకను మనం హర్షిస్తున్నాం. భారత్-చైనా దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడం వలన దీర్ఘకాల ప్రయోజనాలు కలుగుతాయని చరిత్ర, వాస్తవాలు రెండూ చెబుతున్నాయి'' అని అభిప్రాయపడ్డారు.