Page Loader
Narendra Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి  ఐక్యతా సందేశం.. ప్రతిపక్షాలను ప్రశంసించిన ప్రధాని మోదీ
ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్యతా సందేశం.. ప్రతిపక్షాలను ప్రశంసించిన ప్రధాని మోదీ

Narendra Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి  ఐక్యతా సందేశం.. ప్రతిపక్షాలను ప్రశంసించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యత చూపించిన సందేశాన్నిఅంతర్జాతీయంగా చాటి చెప్పడంలో భారత దౌత్య బృందాలు విజయవంతమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాద వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార, ప్రతిపక్ష నాయకులతో కూడిన ఏడు ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపింది. ఈ బృందాలు ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆయా దేశాధినేతలకు తెలియజేశాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రధాని మోదీ తన అధికారిక నివాసంలో ఈ దౌత్య బృందాలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోడీ వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దేశ ప్రయోజనాల కోసం ఈ బృందాలు చేసిన కృషిని మోడీ ప్రశంసిస్తూ, వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

వివరాలు 

33 దేశాల రాజధానులు,యూరోపియన్ యూనియన్‌

ఈ దౌత్య బృందాల్లో ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు పాల్గొనడం విశేషమని మోడీ పేర్కొన్నారు. ఇది భారతదేశం ఉగ్రవాదంపై ఎంతగా ఐక్యంగా ఉన్నదనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి పంపించిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయాణాలు మరిన్ని జరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృందాలు 33 దేశాల రాజధానులు,యూరోపియన్ యూనియన్‌ను సందర్శించాయి. వీరిలో ప్రస్తుత పార్లమెంటు సభ్యులతో పాటు,మాజీ ఎంపీలు,మాజీ దౌత్యాధికారులు కూడా ఉన్నారు.

వివరాలు 

ఇది పూర్తిగా అనధికారిక సమావేశం 

ఈ సందర్బంగా మోడీ ఎక్స్ (ట్విటర్)లో స్పందిస్తూ,"వివిధ దేశాల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధుల బృందాలతో కలిశాను.భారత శాంతియుత ధోరణి,ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకత గురించి ఈ బృందాలు వివరించాయి.దేశ గొంతును ప్రపంచానికి వినిపించిన తీరుపై అందరం గర్వించాలి"అని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా గుర్తు చేస్తూ,ఈ బృందాలకు ప్రశంసలు అందించారు. ఈ సమావేశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ, ప్రధాని మోడీ ప్రతినిధుల బృందాలతో సుమారు గంటసేపు గడిపారని తెలిపారు. ప్రధాని స్వయంగా పచ్చిక బయళ్లలో వారితో నడుచుకుంటూ మాట్లాడారని చెప్పారు. ప్రధాన మంత్రి ఈ విందును ఒక కృతజ్ఞతా సంకేతంగా చూడాలని భావించారని తెలిపారు. అయితే ఇది పూర్తిగా అనధికారిక సమావేశమని స్పష్టం చేశారు.

వివరాలు 

ప్రతినిధుల బృందంలో సభ్యుడిగా AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

ఈ ఏడు బృందాల్లో నాలుగు బృందాలకు పాలక పక్షానికి చెందిన ఎంపీలు నేతృత్వం వహించగా, మిగతా మూడు బృందాలకు ప్రతిపక్ష నేతలు నాయకులుగా వ్యవహరించారు. పాలక పక్షం తరఫున బీజేపీకి చెందిన ఇద్దరు,జేడీయూ,శివసేనకు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నారు. ప్రతిపక్షం తరఫున కాంగ్రెస్,డీఎంకే,ఎన్‌సీపీ (ఎస్పీ)కి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఈ ప్రతినిధుల బృందాలను నేతృత్వం వహించినవారిలో బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ జయ పాండా, కాంగ్రెస్ నేత శశి థరూర్, జేడీయూ నేత సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, డీఎంకేకు చెందిన కనిమొళి, ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే ఉన్నారు. అలాగే AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా సభ్యుడిగా ఉన్నారు.

వివరాలు 

 కాల్పుల విరమణ కోరిన పాకిస్థాన్

ఈ బృందాల్లో ప్రముఖ మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేబినెట్ మంత్రులు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్ లాంటి వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, గత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు నిర్వహించిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం మే 7న భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై "ఆపరేషన్ సిందూర్" ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు చెందిన కొన్ని వైమానిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరడంతో, భారత్ కూడా ఆ ప్రస్తావనను అంగీకరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్