LOADING...
Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్!
హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్!

Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్!

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా భయానక ఘటనలకు దారితీయగల ఉగ్రవాద చర్యలకు పూనుకోవాలని యత్నించిన కుట్రను భారత దర్యాప్తు సంస్థలు ముందుగానే గుర్తించి అడ్డుకున్నాయి. ఈ ఘటన విజయనగరం జిల్లాలో నమోదైన కేసు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో విజయనగరానికి చెందిన 29ఏళ్ల సిరాజ్ ఉర్ రెహ్మాన్, సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన 28ఏళ్ల సయ్యద్ సమీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. సిరాజ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగానికి ప్రయత్నిస్తుండగా, సమీర్ లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రారంభ విచారణలో వీరిద్దరూ 'అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్' (AHIM) అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సంస్థలో సిరాజ్ ప్రధానంగా నెంబర్‌వన్ స్థాయిలో, సమీర్ నెంబర్‌టూ స్థాయిలో వ్యవహరించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

సౌదీ నుంచి హ్యాండ్లర్‌ ఆదేశాలు - ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదింపులు 

దర్యాప్తులో సౌదీ అరేబియాలోని గుర్తుతెలియని ఉగ్ర సంస్థకు చెందిన ఓ హ్యాండ్లర్ వీరికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు సమాచారం లభించింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరితో అతడు నేరుగా సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఆయన సూచనల మేరకు ఈ ఇద్దరూ దేశంలో పేలుళ్లకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకోసం పొటాషియం క్లోరేట్,సల్ఫర్ వంటి రసాయనాలను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశారు. అలాగే,పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఆన్‌లైన్ ద్వారా పొందారు. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరం పరిసర ప్రాంతాల్లో పేలుళ్ల రిహార్సల్స్ నిర్వహించాలని వీరి ప్రణాళిక. కానీ, ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల సంయుక్త చర్యలతో ఈ కుట్రకు బ్రేక్ పడింది.

వివరాలు 

గ్రూప్-2 సన్నద్ధత ముసుగులో హైదరాబాద్‌కు మకాం మార్పు 

నిందితులు మరో కొందరు యువకులు, మైనర్లతో కూడా పలు సమావేశాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సిరాజ్ గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం అవుతున్నాననే నెపంతో విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే అతడు సమీర్‌తో పలు సార్లు కలసి సమావేశాలు జరిపాడు. అనంతరం పరీక్ష రాయడానికి విజయనగరానికి తిరిగి వెళ్లాడు. అప్పటికే పేలుడు పదార్థాల రిహార్సల్స్ కోసం తన చిరునామాకు ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలను తెప్పించాడు. వీరి అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందిన తర్వాత, తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో శనివారం విజయనగరంలో సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా, సమీర్‌ను సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై విజయనగరానికి తరలించారు.

వివరాలు 

సౌదీ హ్యాండ్లర్‌పై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం 

ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గమనించి, దీనిపై ప్రాథమికంగా సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు విజయనగరం రెండో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. అయితే, సౌదీ అరేబియాలో నుంచి వీరిని ప్రేరేపించిన హ్యాండ్లర్ ఎవరన్నది ఇంకా గుర్తించలేదు.

వివరాలు 

అగ్గిపుల్ల మందుతో బాంబు తయారీ - 28 మంది సభ్యుల గ్రూప్ 

దర్యాప్తులో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. హ్యాండ్లర్ 'మ్యాజిక్ లాంతర్' అనే విధానాన్ని ఉపయోగించి, సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద అనుకూల పోస్టులు పెట్టిన వారిలో సానుకూల స్పందన ఇచ్చిన (లైక్‌మైండెడ్) వ్యక్తులను గుర్తించి కలుపుకుంటున్నాడు. ఇదే విధంగా, సిరాజ్,సమీర్‌ను కూడా ఎంచుకున్నాడు. వీరిద్దరూ కలిసి తమ గ్రూపులో 28 మంది యువకులను చేర్చుకున్నట్లు గుర్తించారు. అగ్గిపుల్లల్లో ఉండే మందును ఉపయోగించి బాంబు తయారుచేసే విధానం గురించి హ్యాండ్లర్ వారికి ఫైళ్లు పంపించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆ మార్గదర్శకాలను అనుసరిచేలా సిరాజ్ ఈ నెల 12న విజయనగరంలో ఒక ప్రయోగాత్మక బాంబు తయారీ చేసి పరీక్షించినట్లు తెలుస్తోంది. మరోసారి ప్రయోగానికి సిద్ధమైన సందర్భంలో వారిద్దరూ పోలీసుల బోనులో పడ్డారు.

వివరాలు 

14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు 

విజయనగరం కోర్టు ఈ కేసులో నిందితులైన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌లకు 14 రోజుల న్యాయ రిమాండ్ విధించింది. ఇక సిరాజ్ తండ్రి ఏఎస్సైగా, అతని సోదరుడు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. తన కుమారుడు కూడా పోలీస్ ఆఫీసర్ కావాలని తండ్రి కలలు కనగా, అతను ఉగ్రవాద ప్రభావానికి లోనై ఈ దారిలో నడిచినట్లు విచారణలో తేలింది.