
MLC elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించనున్నారు.
మొత్తం మూడు నియోజకవర్గాల్లో 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 3,55,159 మంది ఓటర్లు హాజరవ్వనుండగా, 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 27,088 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ స్థానంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
Details
773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
ఈ నాలుగు జిల్లాల్లో అధికారులు 773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ 25,797 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఈ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అధికారుల ఆధ్వర్యంలో 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షించారు.
బుధవారం సాయంత్రం కల్లా సంబంధిత జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది అవసరమైన సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.