
Pralhad Joshi: కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ దాడులు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో, కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పరమేశ్వరపై ఈడీ దర్యాప్తు వెనుక కాంగ్రెస్‌లోని ఓ వర్గం పాత్ర ఉన్నదని ఆరోపించారు.
వివరాలు
నిఘా విభాగం ఆయన ఆధీనంలో..
''కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులే పరమేశ్వరపై ఈడీకి ఫిర్యాదు చేశారు.వారే ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. పరమేశ్వర మంచి వ్యక్తి, ఆయనంటే మాకు గౌరవం ఉంది. కానీ అదే పార్టీలో ఆయనను ఇబ్బంది పెట్టే వారు కూడా ఉన్నారు. సీఎం సిద్ధరామయ్యకు ఈ విషయాలన్నీ తెలిసినవే. నిఘా విభాగం ఆయన ఆధీనంలో ఉంది. అయినప్పటికీ ఆయన కూడా డ్రామాలు ఆడుతున్నారు. ఈడీకి సరైన సమాచారం అందినందువల్లే ఈ దాడులు జరిగాయి. "ఆయన కాంగ్రెస్ నాయకుడనో, హోంమంత్రి అనో కాదు' ''అని ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు.
వివరాలు
పరమేశ్వర విద్యా సంస్థల్లో ఈడీ దాడులు
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ నటి రన్యా రావు ఇటీవల అరెస్టైన విషయం విదితమే.
ఆమె వివాహ వేడుక సందర్భంగా, హోంమంత్రి పరమేశ్వర రూ.25 లక్షల నగదు సహా పలు బహుమతులు అందించారని ఈడీ అధికారులు తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పరమేశ్వర చైర్మన్‌గా ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యా సంస్థల్లో ఈడీ దాడులు నిర్వహించింది.
రన్యా రావుతో ఆ సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని కూడా ఈడీ వెల్లడించింది.
వివరాలు
వారిద్దరి మధ్య అనుబంధం
ఇక ఈ విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, రన్యా వివాహానికి హోంమంత్రి బహుమతిగా నగదు ఇచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు.
ఆమె తండ్రి ఐపీఎస్ అధికారి కాగా, పరమేశ్వర హోంమంత్రి కావడంతో, వారిద్దరి మధ్య అనుబంధం ఉండడం వల్ల బహుమతులిచ్చినా తప్పేమీ కాదని అన్నారు.
పరమేశ్వర ఎటువంటి అక్రమం చేయరన్న నమ్మకం తనకు ఉందని కూడా డీకే శివకుమార్ స్పష్టం చేశారు.