Tamil Nadu:తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ వ్యూహం.. పళనిసామి సీఎం, ఉపముఖ్యమంత్రిగా విజయ్?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో పాలిస్తున్న డీఎంకే తనకు ప్రధాన ప్రత్యర్థులని ప్రకటించిన విజయ్, తన నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో కూటమికి సిద్ధమని స్పష్టంగా ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్‌ను కలవడం రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్ భవిష్యత్తు రాజకీయ ప్రయాణానికి మార్గదర్శనం చేస్తూ, ప్రశాంత్ కిశోర్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని నిలువరించాలంటే శాశ్వత ఓటు బ్యాంకు కలిగిన అన్నాడీఎంకేతో పొత్తు అవసరమని పీకే వివరించినట్లు సమాచారం.
దీనిపై అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిసామితో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
Details
ఏపీ మోడల్‌తో విజయ్‌కు క్లారిటీ?
ప్రస్తుతం అన్నాడీఎంకేకు కనీసం 25శాతం ఓట్లు, టీవీకేకు 20శాతం ఓట్లు రావచ్చని, అలాగే అన్నాడీఎంకే కూటమిలోని ఇతర చిన్న పార్టీలను చేర్చుకుంటే 50శాతం ఓట్ల మద్దతు పొందే అవకాశం ఉందని ప్రశాంత్ కిశోర్ విశ్లేషించినట్లు చెబుతున్నారు.
విజయ్‌కి ఏపీ రాజకీయాలను ఉదాహరణగా చూపించిన పీకే, చంద్రబాబునాయుడు - పవన్ కల్యాణ్ పొత్తుతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు.
తమిళనాడులోనూ ఇదే విధంగా ఎడప్పాడి పళనిసామిని సీఎం, విజయ్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించే కూటమిని ఏర్పాటు చేయవచ్చని సూచించినట్లు సమాచారం.
అయితే విజయ్ ఈ ప్రతిపాదనపై ఇంకా స్పష్టతకు రాలేదని చెబుతున్నారు.
Details
టీవీకే శ్రేణుల ఉత్సాహం
ఈ పొత్తు చర్చలు టీవీకే శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ ఎన్నికల వ్యూహ రచన బాధ్యతలను ప్రశాంత్ కిశోర్, ఆదవ్ అర్జున్‌కు అప్పగించినట్లు టీవీకే నేతలు వెల్లడించారు.
2026లో కూటమితో ముందుకు వెళ్లినా, ఆ తర్వాతి ఎన్నికల్లో పూర్తి బలమైన పార్టీగా మారాలన్నది విజయ్ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి విజయ్ తన వ్యూహాన్ని ఖరారు చేసి, ప్రత్యర్థిని ఓడించేందుకు అవసరమైన రాజీలు కుదుర్చుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.