Narendra Modi: వచ్చే వారం ఏపీ పర్యటనకు ప్రధాని రాక..? కారణం ఇదే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉన్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
20వేల ఎకరాల భూమి సేకరణ
ఒక సెప్టెంబర్ మొదటి వారంలో రాకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని (సెప్టెంబర్ 20న) ప్రధాని పర్యటన ఉండేలా మరో ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం సేకరించారు. ఇక కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కోసం 12,500 ఎకరాలను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ సెజ్‌లో ఎగుమతి ఆధారిత పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తీర ప్రాంత రహదారి నిర్మాణాన్ని చేపట్టిన అధికారులు
ప్రభుత్వం ఇప్పటికే సాగర మాల పథకం కింద తీర ప్రాంత రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. ఈ రహదారి కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉండటంతో, ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తుండటంతో, నెల్లూరు జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.