Priyanka Gandhi : ప్రియాంక గాంధీ రాజకీయ పయనం.. నానమ్మ ఆశయాలతో పార్లమెంట్‌కి..!
ప్రజల తరఫున పోరాటం తనకు కొత్త కాదని, 30 ఏళ్లుగా గృహిణిగా ఉన్నానని, ఇప్పుడు ప్రజల గళమెత్తడానికి సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలు వయనాడ్ ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఆమె తొలిసారి ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. రెండు దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఆమెకి ఇదే తొలి విజయం కావడం విశేషం. తల్లి సోనియా గాంధీతో కలిసి ప్రియాంక తొలిసారి 1998లో తమిళనాడులో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
2004ో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇందిరా
'ఎల్లారుం కాంగ్రెసిక్కు ఓట్ పొడుంగల్' అని తమిళంలో మాట్లాడిన ఆమె, నాటి సభలో సోనియాను మించిన ప్రజాదరణ సంపాదించారు. ఆ సమయంలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాకపోయినా, తల్లి సోనియాకు సలహాదారిగా, ప్రచార సహాయకురాలిగా మద్దతుగా నిలిచారు. 2004లో ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ తరఫున ప్రచారంలో పాల్గొని పార్టీకి పరోక్షంగా తొడ్పడింది. 2019లో ఆమె పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చి, ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజానెత్తుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర
2022 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుక కీలక పాత్ర పోషించి, పార్టీ విజయం సాధించేందుకు ప్రియాంక కృషి చేశారు. ఆ తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన మార్క్ చూపించి పార్టీని గెలుపు వైపు నడిపించారు. సార్వత్రిక ఎన్నికలలో మోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా గళమెత్తేందుకు కాంగ్రెస్‌కు ప్రియాంక కీలక మద్దతు అందించారు. వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక తన ప్రత్యర్థుల విమర్శలకు ఘాటుగా స్పందిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. మహిళలు, యువత సమస్యలను ప్రధానంగా ముందుకు తీసుకొస్తూ, ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకత చూపించారు.
ఇందిరమ్మ వారసురాలిగా ఎదుగుదల
వయనాడ్ లోకసభ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీని దాటి, భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రియాంక గాంధీ వ్యక్తిత్వం, వాగ్దాటి, నేతృత్వంలో తన నానమ్మ ఇందిరా గాంధీ వారసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. తన రాజకీయ శైలిలో గాంధీ-నెహ్రూ కుటుంబం విలువలతో పాటు, ఆధునిక సమాజానికి అవసరమైన ధృఢతను చాటుకున్నారు. నానమ్మలాగే, ఆమె రాజకీయాల్లో కీలకమైన మార్గదర్శక పాత్ర పోషించేందుకు సిద్ధమని ఈ విజయం స్పష్టంగా తెలియజేస్తోంది.