భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు
అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు. భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టమని, దేశంలోని రాజకీయాలను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నియంత్రిస్తున్నాయని మాటల దాడికి దిగారు. రాహుల్ గాంధీ తన 10 రోజుల యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో భాగంగా బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన " మోహబత్ కి దుకాన్" అనే కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ ఇబ్బందులను రాహుల్ గాంధీ లేవనెత్తారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
భారత్ జోడో యాత్రను అందుకే చేశా: రాహుల్
తాము ప్రజలతో మమేకం కావడానికి అవసరమైన అన్ని సాధనాలను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రించడం వల్లే భారత్ జోడో యాత్రను చేపట్టినట్లు రాహుల్ అన్నారు. ద్వేషాన్ని అరికట్టి, ప్రజల్లో ప్రేమ, ఆప్యాయతతో కూడిన వాతావరణాన్ని సృష్టించేందుకు భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. చరిత్రలో గురునానక్ దేవ్ జీ, గురు బసవన్న జీ, నారాయణ గురు జీతో సహా ఆధ్యాత్మిక నాయకులందరూ ఇదే విధంగా దేశాన్ని ఏకం చేశారని రాహుల్ గుర్తు చేశారు. భారతదేశంలోని కొన్ని మీడియా సంస్థల గురించి కూడా రాహుల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని మీడియా సంస్థలు వాస్తవాన్ని వక్రీకరించి, బీజేపీకి అనుకూలమైన కథనాలను వండి వారస్తున్నాయని రాహుల్ చెప్పుకొచ్చారు. అందుకే మీడియాలో చూసేవన్నీ నిజం కాదని రాహుల్ వ్యాఖ్యానించారు.
మోదీ మాటలకు దేవుడు కూడా గందరగోళానికి గురవుతాడు: రాహుల్
మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే, అతను విశ్వం ఎలా పనిచేస్తుందో దేవునికి వివరించడం ప్రారంభిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేవుడు తాను సృష్టించిన విశ్వం గురించి మోదీ చెప్పడంపై గందరగోళానికి గురవుతాడని రాహుల్ పేర్కొన్నారు. దేశంలోని పేదలు, మైనారిటీ వర్గాల ప్రజలు నిస్సహాయంగా ఉన్నారని రాహుల్ వివరించారు. రాజకీయ వ్యవస్థలో, వ్యాపారాల్లో మహిళలకు స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉందని రాహుల్ చెప్పారు. రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉందన్నారు. అమెరికాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారతీయతను చాటిన ప్రవాస భారతీయులకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.