Page Loader
Rahul Gandhi: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2023
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్ అంశంపై చర్చించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి. వారం రోజుల క్రితం తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంట్ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. మంగళవారం, బుధవారం ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వనున్నారు. మొదట అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. నాలుగు నెలల తర్వాత పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సభలో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై బీజేపీ ఎంపీలకు ఈ సమావేశంలో ఇప్పటికే మార్గనిర్దేశం చేశారు.

Details

అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్న ఐదుగురు మంత్రులు

మణిపూర్‌ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చింది. ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జూలై 26న లోక్‌సభలో స్పీకర్ ఆమోదించారు. ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చకు మూడు రోజుల సమయాన్ని కేటాయించారు. ఆగస్టు 10న ఈ తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. లోక్‌ సభలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్రం తరపున అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు మాట్లాడనున్నారు.