తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకరించింది. ఈ మేరకు 6 నెలల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన సాంకేతికత అవకాశాలను సర్వే ద్వారా నిర్ణయించనున్నారు. ఏపీలోని విశాఖ - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ కు మొదటి రైలు కేటాయించగా, మరోటి విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకార తెలిపింది. ఈ మేరకు అధికారికంగా సౌత్ సెంట్రల్ రైల్వేకు లేఖ రాసింది.
తెలుగు ప్రజలకు ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ తో మాట్లాడి ఎట్టకేలకు ఒప్పించారు. 942 కిలోమీటర్ల మార్గంలో గరిష్టంగా 220 కిమీ వేగంతో ప్రయాణించేలా ట్రాక్ నిర్మాణం కోసం 6 నెలల్లో సర్వే పూర్తి చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే కొత్త రైల్వేలైన్లు, స్టేషన్ల అభివృద్ధి సహా డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం అందించింది.