Page Loader
Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. వికారాబాద్‌-కృష్ణాల మధ్య ఏర్పాటు
తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. వికారాబాద్‌-కృష్ణాల మధ్య ఏర్పాటు

Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. వికారాబాద్‌-కృష్ణాల మధ్య ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా రాష్ట్రంలోని అనేక రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లో అతిపెద్ద రైల్వే టెర్మినల్‌ను చర్లపల్లిలో నిర్మించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి, ఇవి త్వరలోనే పూర్తవ్వనున్నాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో 30కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ పథకం తొలి విడత కింద అభివృద్ధి చేస్తున్నారు. అదనంగా, రాష్ట్రంలో కొత్త రైల్వే ట్రాక్‌ల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

వివరాలు 

వికారాబాద్‌-కృష్ణాల మధ్య కొత్త రైల్వే లైన్

తాజాగా, తెలంగాణలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. వికారాబాద్‌-కృష్ణాల మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ లైన్ మొత్తం 121.70 కిలోమీటర్ల పొడవుగా ఉండగా, దీని సర్వే ఇప్పటికే పూర్తయిందన్నారు. మార్చి 19 (బుధవారం) లోక్‌సభ సమావేశంలో, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. చింతపల్లి, పరిగి, కొడంగల్, టేకుల్‌కోడ్, రావులపల్లె, మాటూర్, దౌల్తాబాద్, దామరగిద్ద, నారాయణపేట, మక్తల్‌ మీదుగా ఈ రైల్వే మార్గం కొనసాగుతుందని తెలిపారు.

వివరాలు 

కొత్త రైల్వే లైన్‌కు డీపీఆర్ 

ఈ కొత్త రైల్వే లైన్‌కు డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీకి అనుమతులు మంజూరయ్యాయని కేంద్రం వెల్లడించింది. అయితే, ఈ ప్రాజెక్టును పూర్తిగా రైల్వే నిధులతోనే నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని తెలిపారు. ప్రాజెక్టు ఆమోదానికి సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం వివిధ భాగస్వాములతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని, నీతి ఆయోగ్, ఆర్థికశాఖ అనుమతులు కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ అనుమతులు లభించిన తర్వాత మాత్రమే ప్రాజెక్టు పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా చెప్పగలమని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

వివరాలు 

తెలంగాణలో 30,755 మొబైల్ టవర్లు

అదేవిధంగా, తెలంగాణలో ప్రస్తుతం 30,755 మొబైల్ టవర్లు ఉన్నాయని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్‌లో తెలిపారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 2021 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 25,097 మొబైల్ టవర్లు ఉండగా, 2025 ఫిబ్రవరి 28 నాటికి ఆ సంఖ్య 30,755కి పెరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా తమిళనాడులో 50,093, కర్ణాటకలో 49,917 మొబైల్ టవర్లు ఉండగా, ఆ తరువాతి స్థానంలో తెలంగాణ ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 28,803 మొబైల్ టవర్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.