Heavy Rains: తమిళనాడును అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేత
తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైతో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షం పడుతోంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విళ్లుపురం, కడలూరు, నాగపట్టణం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నీటి నిల్వలు, రహదారి సౌకర్యాల్లో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా చెన్నై, కడలూరు, తంజావూరు, మైలాదుతురై, పుదుక్కొట్టై, దిండిగల్, రామనాథపురం, తిరువావూర్, రాణిపేట్ తదితర జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్
ప్రజల భద్రత కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్షాలకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. వేలూరు, సేలం, నమక్కల్, శివగంగ, మదురై, దిండిగల్‌లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూత్తుకుడి, తెన్కాసి, తెని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు చేపడుతోంది. నీటి నిల్వలు, రవాణా దారుల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సమయంలో అవసరమైన సేవలు అందించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.