Page Loader
Shakur Khan: పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు 
పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు

Shakur Khan: పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి షకూర్ ఖాన్‌ను పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసినట్లు అనుమానంతో బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది. గత కొన్ని వారాలుగా అతనిపై విచారణాధికారులు నిశితంగా నిఘా ఉంచినట్టు వెల్లడించారు. షకూర్ ఖాన్‌ పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలు కలిగి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఆధారాలతోనే అతడిని అరెస్ట్ చేశామని జైసల్మేర్‌ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ చౌదరి తెలిపారు. అతడి ఫోన్‌ను పరిశీలించిన అధికారుల బృందం, అందులో పలు పాకిస్తానీయుల ఫోన్ నంబర్లు ఉన్నట్టు గుర్తించింది. వాటి గురించి అడిగిన ప్రశ్నలకు షకూర్ సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేకపోయాడని సమాచారం.

వివరాలు 

మొబైల్‌లో కీలక ఫైల్స్ డిలీట్ అయినట్లు గుర్తింపు 

ఇకపోతే అతడు ఇప్పటివరకు ఏకంగా ఏడు సార్లు పాకిస్తాన్‌కు ప్రయాణించినట్టు రికార్డుల ద్వారా తేలింది. అతడి మొబైల్ ఫోన్‌ పరిశీలనలో కొన్ని ఫైల్స్ డిలీట్ అయినట్లుగా గుర్తించారని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, అతని బ్యాంకు ఖాతాలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇటీవల అతడి ఒక ఖాతా మూసివేసినట్లు గుర్తించి, దానిపైన ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా, షకూర్ ఖాన్‌కు రాజస్థాన్ మాజీ మంత్రి షేల్ మొహమ్మద్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ సమయంలో ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసినట్టు అధికారులు వెల్లడించారు. షేల్ మొహమ్మద్, కాంగ్రెస్ ప్రభుత్వంలో అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. షకూర్,షేల్ మొహమ్మద్ గ్రామాలు కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉండేవని గుర్తించారు.

వివరాలు 

సోషల్ మీడియాలో షకూర్ ఖాన్, షేల్ మొహమ్మద్,ఘాజీ ఫకీర్‌లతో కలసి ఉన్న ఫోటోలు

షేల్ మొహమ్మద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినట్టు రికార్డులు పేర్కొంటున్నాయి. స్థానికుల కథనం ప్రకారం,షకూర్ ఖాన్ తరచూ షేల్ మొహమ్మద్ తండ్రి ఘాజీ ఫకీర్‌ను కలిసేవాడని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో షకూర్ ఖాన్, షేల్ మొహమ్మద్,ఘాజీ ఫకీర్‌లతో కలసి ఉన్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఘాజీ ఫకీర్ 2021లో మృతి చెందారు. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పోలీసులు,నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. జైసల్మేర్ ప్రాంతాన్ని బహుళ భద్రతతో నిఘా పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఆరుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వివరాలు 

పాక్ పౌరులకు ఇచ్చే వీసాల రద్దు

వారితో పాటు ఏడవ వ్యక్తిగా షకూర్ ఖాన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ సుధీర్ చౌదరి తెలిపారు. ఇదే సమయంలో, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది భారతీయులను హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు ప్రతిస్పందనగా భారత్ పలు కఠిన చర్యలు చేపట్టింది. పాకిస్తాన్‌కు సరఫరా చేస్తున్న సింధు నదీ జలాలను నిలిపివేసింది. పాక్ పౌరులకు ఇచ్చే వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసివేసింది. అంతేకాకుండా, మే 7న "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాక్‌పై బలమైన దాడి జరిపింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమవ్వడమే కాకుండా, పాకిస్తాన్ వైమానిక స్థావరాలు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు భారత అధికార వర్గాలు వెల్లడించాయి.