
Delhi Rains: దిల్లీకి రెడ్ అలెర్ట్ .. వందకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్లీలో కుండపోత వర్షం కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. పండుగ సమయానికి నగరంలోని రహదారులు నీటితో నిండిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) సమాచారం ప్రకారం, శనివారం ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
నాలుగు విమాన సర్వీసులను పూర్తిగా రద్దు
అలాగే, ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 90 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అదనంగా, నాలుగు విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్టు కూడా తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఢిల్లీలోని అండర్‌పాస్‌లలో వర్షపు నీరు చేరిపోయింది. పలు లోతట్టు కాలనీలు వరద నీటితో మునిగిపోయాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అనేక ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్,ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. అదేవిధంగా, హర్యానాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.